గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నాయకులను అరెస్టు చేయగా మరికొందరిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. జలదీక్షలో భాగంగా కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనకు పోలీసుల నుంచి ఏలాంటి ముందస్తు అనుమతి లేదు. దీంతో సందర్శనకు వెళ్లకుండా నిలువరించేందుకు నిన్నటి నుంచే కాంగ్రెస్ నాయకుల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతురావు, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్‌లు దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లుతుండగా రాత్రి కొత్తగూడెం సింగరేణి అతిథి గృహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం సీతారాం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లుతున్న ఎమ్మెల్యే పోడెం వీరయ్యను పోలీసులు అడ్డుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాల్సిన ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు ములుగులో గృహనిర్బంధంలో ఉంచారు.
గౌరెల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సబీర్ అలీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలంగౌడ్‌లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడిక్కడ అడ్డుకోవడం, అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచుతుండడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకులతో ఫోన్ ద్వారా పలకరిస్తూ... స్థానికంగా నెలకొన్న తాజా పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నాడు.