ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ మధ్య ఏదో విధంగా వైరం రగులుతూనే ఉంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. ఇండస్ట్రీ వారికి నచ్చడం లేదు. మొన్నటి వరకు సినిమా టికెట్ల చుట్టూ తిరిగిన వివాదాలు కాస్తా.. ఇప్పుడు నాటకాల వైపు మళ్లాయి. 'చింతామణి నాటకం' రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమకు జీవనాధారంగా ఉన్న 'చింతామణి నాటకం'పై నిషేధం విధించడం దారుణమంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు అప్పారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 'చింతామణి నాటకం'పై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అప్పారావు డిమాండ్ చేశారు. చింతామణి నాటక ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కళాకారులను, కళలను ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు అప్పారావు తెలిపారు.
ఇదీ చూడండి: చింతామణి నాటకంపై నిషేధం.. ఏపీ వ్యాప్తంగా కళాకారుల ఆందోళనలు