ISRO Chairman in KLU : సమాజంలోని సమస్యలను పరిష్కరించాలంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు పెరగాలని, అవి జీవన విధానంలో అనూహ్య మార్పులు తెస్తాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వర్చువల్ విధానంలో పాల్గొన్న శివన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్య, వైద్యం, పారిశ్రామిక, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికం సహా అన్ని రంగాల్లో సాంకేతిక వినియోగం పెరిగిందని శివన్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో ఏటేటా గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని పేర్కొన్నారు. గత ఆరు దశాబ్దాల్లో ఇస్రో పరిధిని విస్తరిస్తూ వస్తున్నామని.. భారత ప్రభుత్వం కేంద్రీకృత రంగాల్లో ఒకటిగా అంతరిక్షాన్ని గుర్తించడం శుభపరిణామని చెప్పారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అంతరిక్ష పరిజ్ఞానం గురించి బోధించాలని అభిప్రాయపడ్డారు.
'ప్రపంచం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీ పడటం చాలా ముఖ్యం. తద్వారా మంచి ఉద్యోగాలను సాధించుకోవాలి. దాని వల్ల మంచి కెరీర్‌ను రూపొందించుకోగలుగుతారు. విద్యా, వృత్తిగత జీవితాల మధ్య విద్యాసంస్థలనేవి వారధిగా ఉండాలి. విద్యార్థుల్లో వ్యాపార లక్షణాలు గుర్తించడం, ఆ సామర్థ్యాలు పెంపొందించడానికి ఈ విద్యాసంస్థలే కీలక ప్రదేశం. విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతి అడుగూ ప్రాక్టికల్‌గా వేస్తే.... కెరీర్ కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం లేదు. మన నేటి చర్యలే రేపటి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.'- డా.శివన్, ఇస్రో ఛైర్మన్
ఇవీచూడండి: CJI at Bhadrakali Temple : భద్రకాళీ అమ్మవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు