Invitation To KTR: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. అమెరికాకు చెందిన మిల్కెన్ ఇన్స్టిట్యూట్ తమ 25వ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. లాస్ ఏంజిల్స్ నగరంలో మే 1 నుంచి 4 వరకు 'సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్' పేరిట ఈ సదస్సు జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు రాజకీయ, ఆర్థిక, వైద్య రంగాల ప్రముఖులు, వ్యాపార వేత్తలు, నిపుణులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సదస్సుకు తనకు ఆహ్వానం అందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించిన మిల్కెన్ ఇన్స్టిట్యూట్కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్త ప్రముఖులను కలిసేందుకు సదస్సు ఓ వేదిక అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇటీవలే అమెరికాలో పర్యటన..
మంత్రి కేటీఆర్ బృందం ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. వారం రోజులు అమెరికాలో పర్యటించి.. రూ.7,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, ఇన్నోవేషన్ వంటి నాలుగు సెక్టార్లలో పలు కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈవెంట్లు, 35 వరకు బిజినెస్ సమ్మిట్లలో మంత్రి కేటీఆర్ పాల్గొని.. అమెరికా పర్యటనను ఫలవంతంగా ముగించారు.
ఇదీ చూడండి: కేటీఆర్ యూఎస్ టూర్.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నంటే?