Internal Roads in Hyderabad : బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్), ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్)ను అనుసంధానం చేసేందుకు అంతర్గత మార్గాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం నగరం నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరుకున్న వారు.. అక్కడ నుంచి ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌కు రావాలంటే కష్టమే. కొన్ని ప్రాంతాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపైనే రావాలి. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగితే ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది.
ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ప్రాంతీయ రింగ్‌రోడ్డును అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేయాలనేది యోచన. ఈ రహదారులపై ఇప్పటికే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నగరానికి ఔటర్‌కు మధ్య ఉన్న కొన్ని రేడియల్ రోడ్లను ఔటర్ రింగ్‌రోడ్డుతో ఆపకుండా అక్కడ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు పొడిగించాలనేది ఒక ప్రణాళిక. అలాగే అవుటర్ రింగ్ చుట్టూ కొన్ని పట్టణాలు, కీలక ప్రాంతాలు ఉన్నాయి. వీటినే అర్బన్ నోడ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీటిని కలుపుతూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు వరకు కూడా రహదారులను కొనసాగించనున్నారు. ఇలా మొత్తం 25 రహదారులను కొత్తగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే అవుటర్, రీజనల్ రింగ్‌రోడ్డుకు మధ్య కొన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంతోపాటు కొత్తవి కూడా నిర్మించనున్నారు. 450 కిలోమీటర్ల విస్తీర్ణంలో వీటిని నిర్మించటానికి ప్రాథమికంగా కసరత్తు జరుగుతోంది. కనీసం 4 లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. రూ.వేయి నుంచి రూ.1,500 కోట్లు వరకు ఖర్చు అవుతుందనేది అంచనా.
కొత్త రహదారులు కలిపే కీలక ప్రాంతాలు:
ఫరూఖ్‌నగర్, దౌడుగూడ, గుండేలగూడ, రాచలూరు, ఇబ్రహీంపట్నం, బీబీనగర్, బొమ్మలరామారం, ములుగు, వర్గల్, తూప్రాన్, దొంతి, శివ్వంపేట, నర్సాపూర్, దౌల్తాబాద్, ఇస్మాయిఖాన్‌పేట, ఎదుమైలారం, శంకర్‌పల్లి, చేవేళ్ల, తడ్లపల్లె, షాబాద్
ఔటర్‌కు సమీపంలోని అర్బన్‌నోడ్‌లు:
ఫరూఖ్‌నగర్, షాబాద్, చేవేళ్ల, సంగారెడ్డి, జీడిపల్లె, తూప్రాన్, బీబీనగర్, భువనగిరి, మల్కాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, గుండేలగూడ
బాహ్యవలయ రహదారి పొడవు: 158 కి.మీ
నగరం నుంచి అవుటర్ చేరడానికి నిర్మించాలనుకున్న రేడియల్ మార్గాలు: 33
అందుబాటులోకి వచ్చింది: 18