రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం(2019-20) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పిన వారు, పాసైనా మార్కులు పెంచుకోవాలనుకున్న(ఇంప్రువ్‌మెంట్) వారు మే 1 నుంచి జరిగే వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలు రాసుకోవాల్సిందే. వార్షిక పరీక్షల కంటే ముందుగా విడిగా పరీక్షలు నిర్వహించేది లేదని స్పష్టమైంది. ఇంటర్ పరీక్షల ఫీజుకు సంబంధించి ఇంటర్‌బోర్డు శనివారం కాలపట్టిక జారీ చేసింది. తప్పినవారు, బెటర్‌మెంట్ వారు కూడా పరీక్షల ఫీజు చెల్లించాలని అందులో పేర్కొంది. ఇంకా 2019, 2020లో ఇంటర్ రెండో ఏడాది పాసైన వారు మార్కులు పెంచుకోవాలనుకుంటే బెటర్‌మెంట్ రాసుకోవచ్చు. వారికి ఇదే చివరి అవకాశం. గత మార్చి పరీక్షల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,92,172 మంది తప్పారు.
ఎంసెట్ రాయబోయే విద్యార్థుల్లో ఆందోళన
ఇంటర్‌లో ప్రధాన సబ్జెక్టుల మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి ప్రథమ ఏడాదిలో తప్పిన సబ్జెక్టులతోపాటు రెండో ఏడాది పరీక్షలు రాయాలంటే ఒత్తిడికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలు కూడా వరుసగా ఉన్నాయి. మధ్యలో సెలవులు కూడా లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
బ్రిడ్జి కోర్సు ఇంకెందుకు?
ఇంటర్ బైపీసీ గ్రూపు విద్యార్థులు ఇంజినీరింగ్‌లో బీటెక్ బయోటెక్నాలజీలోనూ చేరొచ్చు. వారు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో గణితం బ్రిడ్జి కోర్సు పూర్తి చేయడం 2018-19 విద్యా సంవత్సరం వరకు తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత నుంచి ఆ కోర్సు లేకుండానే బీటెక్ బయోటెక్నాలజీలో చేరొచ్చని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. దాన్ని పట్టించుకోని ఇంటర్‌బోర్డు యథావిధిగా బ్రిడ్జి కోర్సుకు కూడా ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఫిబ్రవరి 11
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో వాటికి హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫిబ్రవరి 11వ తేదీ వరకు పరీక్షల రుసుం చెల్లించవచ్చు. రూ.100 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 22 వరకు, రూ.500తో మార్చి 2 వరకు, రూ.వెయ్యితో మార్చి 9 వరకు, రూ.2 వేలతో మార్చి 16 వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ పేర్కొన్నారు. పరీక్ష రుసుం రూ.480 నుంచి రూ.810 వరకు ఉంది. గ్రూపులను బట్టి అది మారుతుంది.