- ధారూర్ మండలం అవుసుపల్లికి చెందిన అమృతమ్మ నిత్యం వికారాబాద్ పట్టణానికి రాకపోకలు సాగిస్తూ, అడ్డా కూలీగా పని చేసేవారు. ఈ క్రమంలో చౌరస్తాలో ఆమె నిల్చుండగా అల్లీపూర్‌కు చెందిన కిష్టయ్య పరిచయం చేసుకుని, జనసంచారం లేని ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి హత్య(MURDER) చేసి ఒంటిపై ఉన్న ఆరు గ్రాముల బంగారం, మెట్టెలు అపహరించాడు. సీసీ కెమెరా ఆధారంగానే నిందితుడిని అరెస్టు చేశారు.
- వికారాబాద్ మహాశక్తి చౌరస్తాలో ఓ మహిళను ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో(BIKE ACCIDENT) గాయాలయ్యాయి. వాహనదారుడు ఆగకుండా వెళ్లిపోయాడు. రామయ్యగూడ రోడ్డులో ఈవ్‌టీజింగ్‌కు యువతి గురైంది. ఈ రెండు ఘటనల్లో వీటి ఆధారంగానే నిందితులను గుర్తించారు.
- వికారాబాద్ కాకతీయ పాఠశాల సమీపంలో జల్సాలకు అలవాటు పడిన డిగ్రీ విద్యార్థులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లారు. గత మార్చిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పుటేజీల ఆధారంగా వారిని అరెస్టు చేశారు.
ఇలా వివిధ కేసుల్లో నిందితులను కెమెరాలు పట్టిస్తున్నాయి. చోరీలు, రహదారి ప్రమాదాలు, గొడవల వివరాలు తెలిసిపోతున్నాయి. పల్లెల నుంచి వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటంతో పట్టణాలు విస్తరిస్తున్నాయి. శివారుల్లో ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. మరో వైపు విలువైన వస్తువులు విక్రయించే దుకాణాల్లో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిఘా కళ్లు(CC CAMERAS) ఏర్పాటు చేస్తున్నారు. ఏ సంఘటన జరిగినా వీటిల్లో అంతా నిక్షిప్తం అవుతున్నాయి. స్వీయ భద్రతకు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ‘నేను సైతం’ కార్యక్రమానికి పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికత మన ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. నగరాలు, పట్టణాల్లో దుకాణ సముదాయాలు, రద్దీ కూడళ్లు, ప్రజలు నిరంతరం సంచరించే బస్టాండ్లల్లో మాత్రమే సీసీ కెమెరాలు కనిపించేవి.. ఇప్పుడు చిన్న వ్యాపార సంస్థలు మొదలుకుని గృహాల్లో సీసీ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ద్వారే చోరీలకు పాల్పడుతున్న వారు పోలీసులకు పట్టుబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 650 కెమెరాలు ప్రధాన కూడళ్లతో పాటు కీలకమైన ప్రాంతాల్లో బిగించారు.
శివారు ప్రాంతాల్లో...
కాలనీలు విస్తరిస్తున్నప్పటికి.. జనాభా ప్రాతిపదికన పోలీసులు పెరగడం లేదు. నిఘా వ్యవస్థ పెరగకపోవడంతో ప్రజలు ఎవరికివారే సొంత భద్రతలపై దృష్టి సారిస్తున్నారు. నివాస ప్రాంతాలు పెరిగేకొద్ది రద్దీ తీవ్రత పెరిగింది. ఎవరేం చేస్తున్నారో చెప్పడం కష్టం.. రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలు పెరిగాయి. శివారు ప్రాంతాల్లో చోరీలు(THEFTS) జరుగుతున్నాయి. నిందితుల కోసం వెతకడం, విచారణ వంటి సంఘటనలతో కాలం గడుస్తోంది. దీనిని అధిగమించేందుకు కెమెరాల వినియోగం పెరుగుతోంది.
నిఘా నీడలోనే..
వికారాబాద్ పట్టణ పరిధిలోని ప్రతి కూడలిలో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఏ సంఘటన జరిగినా తెలిసిపోతుంది. నాణ్యమైన హైరెజల్యూషన్ ఉన్న వాటిని ఉపయోగిస్తున్నారు. కాలనీల్లోని ముఖ్య ప్రదేశాలు, ఆలయాలు, ప్రార్థనాల మందిరాల వద్ద అమరుస్తున్నారు. ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు సుమారు 35 కెమెరాల్లో నిక్షిప్తమయ్యేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ప్రజల భాగస్వామ్యం
నేరాల ఛేదన, నియంత్రణ, భద్రతను మెరుగుపరిచేందుకు దోహదపడే వీటి ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ వికారాబాద్ పోలీసులు రెండేళ్ల కిందట నేను సైతం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కాలనీ వాసులు విరాళాలు పోగుచేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 285 ఏర్పాటు చేశారు. ఏడాది కిందట వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని సూర్యప్రకాష్‌నగర్ కాలనీ వాసులు రూ.6.5 లక్షలు అందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా వారు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాంకేతిక అభివృద్ధితో నేరాలకు అడ్డుకట్ట
ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానం. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వాటితో పోల్చుకుంటే వెనుకబడి ఉన్నాం. వీటి ఏర్పాటుతో నిందితులను పట్టుకోవచ్చు. సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 3 వేల సీసీ కెమెరాలు లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించాం. గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయడానికి సర్పంచులు ముందుకు వస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆ.. ఒక్కటి వంద మంది పోలీసులతో సమానం'