కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో నిరాడంబరంగా జరుగనున్నాయి. ఏటా ఆగస్టు 15న గోల్కొండ కోట వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించనుండగా.... ఈసారి కార్యక్రమాన్ని ప్రగతిభవన్‌కు పరిమితం చేశారు. ఉదయం10 గంటలా 15 నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్దనున్న వీరుల సైనిక స్మారకం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు ఎలాంటి ఆడంబరాలు లేకుండానే జరగనున్నాయి. మంత్రులు, ప్రముఖులు ఆయా జిల్లా కలెక్టరేట్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తారు. కొవిడ్ నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని..... మార్గదర్శకాలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో గవర్నర్ తమిళిసై దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.