Income limit for Scholarships : రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల విద్యార్థుల ఉన్నత విద్య, ఉపకార వేతనాల సంక్షేమ పథకాలకు వేర్వేరుగా కుటుంబ వార్షికాదాయ పరిమితులు అమలవుతున్నాయి. మరోవైపు ఉపకార వేతనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పరిమితులు ఒకే విధంగా లేకపోవడంతో గందరగోళం నెలకొంటోంది. విద్యార్థుల సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో ఏడేళ్ల క్రితం నిర్ణయించిన కుటుంబ వార్షికాదాయ పరిమితిని నేటికీ సవరించలేదు. దీంతో చివరకు పొరుగుసేవల కింద పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి పిల్లలకూ ఉపకార వేతనాలు అందని పరిస్థితి నెలకొంది.
ఆదాయ పరిమితి ఉంటేనే.. ఉపకార వేతనాలు..
Income limit for Scholarships in Telangana : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన ఫీజులు, గురుకుల ప్రవేశాలు, స్వయం ఉపాధి రుణాలు తదితర పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆదాయ పరిమితి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో గ్రామాల్లో రూ.65 వేల నుంచి రూ.1.5 లక్షలకు, పట్టణాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు ఈ పరిమితిని పెంచింది. ఈ పరిధిలోపు ఉన్న కుటుంబాలకు ఉపకార వేతనాలు అందుతున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులకు మాత్రం గరిష్ఠ ఆదాయ పరిమితిని 2017లో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. కానీ ఇతర సంక్షేమ పథకాలకు 2015 నాటి పరిమితే కొనసాగుతోంది.
కేంద్రంలో రూ.2.5 లక్షలు..
Student Scholarships in Telangana : కేంద్ర ప్రభుత్వం బీసీ, ఈబీసీ, సంచార జాతులకు అందిస్తున్న ఉపకార వేతనాలకు వార్షికాదాయ పరిమితి గత ఏడాది నుంచి పెంచింది. సంక్షేమవర్గాల వారీగా గతంలో వేర్వేరుగా ఆదాయ పరిమితులు కొనసాగాయి. కానీ, ఇటీవల అందరికీ ఏకరూప ఆదాయ పరిమితి నిర్ణయించి రూ.2.5 లక్షలకు పెంచింది. రాష్ట్రంలో మాత్రం ఆదాయ పరిమితి రూ.2 లక్షలుగా కొనసాగుతోంది.
ధరలు పెరుగుతున్నా ..
రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, మారుతున్న కనీస వేతనాల మేరకు సంక్షేమ పథకాలకు కుటుంబ ఆదాయ పరిమితి పెరగలేదు. 2013లో ఒకసారి, 2015లో మరోసారి మాత్రమే సవరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిమితికి లోబడి ఆదాయమున్న కుటుంబాలు పట్టణాల్లో అద్దెలు కట్టి, కుటుంబ ఖర్చులు తీసివేసినా అప్పుల్లోనే బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖర్చులతో సంబంధం లేకుండా కుటుంబ పెద్ద పొందుతున్న వేతనం/ఆదాయం పట్టణాల్లో సగటున నెలకు రూ.16,666, గ్రామాల్లో రూ.12,500 దాటినా పరిమితిని సవరించే ప్రయత్నాలు జరగడం లేదు.
- ఇదీ చదవండి : వలసబాటలో తల్లిదండ్రులు.. చదువుకు దూరంగా చిన్నారులు