ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లో.. అరుదైన కచిడీ రకం చేపలు.. మత్స్యకారుల వలకు చిక్కాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులు.. వీటిని పట్టుకున్నారు. చూడ్డానికి భారీ స్థాయిలో.. విపరీతమైన బరువుతో ఉండే ఈ కచిడీలు.. మంచి ధర సైతం సొంతం చేసుకున్నాయి.
ఓ మగ కచిడీతో పాటు.. ఆడ కచిడీ సైతం వలలో పడ్డాయి. అందులో మగ చేప 16 కిలోల బరువు ఉండగా.. ఆడ కచిడీ 15 కిలోల బరువు తూగింది. ఇవి వలలో చిక్కాయని తెలిసిన క్షణాల్లో జనాలు వాటి కోసం ఎగబడ్డారు. డిమాండ్ చూసిన మత్స్యకారులు.. వాటికి వేలం నిర్వహించారు. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని పేరున్న ఈ కచిడీ కోసం.. చేపల ప్రియులు తెగ ఆరాటం ప్రదర్శించారు. మగ చేప.. ఏకంగా లక్ష రూపాయలకు అమ్ముడుపోగా.. ఆడ చేప 30 వేల రూపాయల ధర పలికింది.
మగ కచిడీ పొట్ట భాగంలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయని.. అందుకే ఆడ కచిడీ కంటే ఎక్కువ ధర పలుకుతుందని.. మత్స్య శాఖ ఏడీ కృష్ణారావు తెలిపారు. మరోవైపు.. ఈ భారీ చేపలను చూసేందుకు.. చాలామంది ఆరాటం ప్రదర్శించారు.
ఇదీ చదవండి: