KAKINADA STUDENTS FELL ILL: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గ్రామీణం పరిధిలోని.. వలసపాకలలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఉదయం.. అసెంబ్లీ ముగిసిన తర్వాత విద్యార్థులు తరగతి గదులకు వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే.. 5, 6, ఏడో తరగతిలో హాహాకారాలు వినిపించాయి. విద్యార్థులు ఒక్కొక్కరుగా సొమ్మసిల్లిపడిపోయారు. దాదాపు 50మంది వరకూ విద్యార్థులు పడిపోయారు.
వెంటనే పాఠశాల సిబ్బంది.. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలు సొమ్మసిల్లిపడిపోవడం చూసి ఆందోళన చెందారు. ఆ తర్వాత వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను.. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు కారణం ఏంటో తెలియదని.. పాఠశాల యాజమాన్యం కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు వాపోయారు.
ఘాటైన విషవాయువు పీల్చడం వల్లే విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ బుద్ధ చెప్పారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కేంద్రీయ విద్యాలయంలో సోమవారం ఓ విద్యార్థికి పుట్టిన రోజులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రసాయన స్ప్రేలు వినియోగించినట్లు సమాచారం. అయితే ఏ రసాయనాలు పీల్చడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది.
ఇవీ చదవండి: