ETV Bharat / city

ఈ అద్భుతం ఎలా జరిగింది..?!

author img

By

Published : Sep 6, 2020, 1:44 PM IST

ఆగస్టు 23... ఆరోజు ఐఐటి- బాంబే స్నాతకోత్సవ సంబరం. కానీ కరోనా భయంతో విద్యార్థులెవరూ ఇల్లు కదల్లేదు.  ప్రొఫెసర్లూ గడపదాటలేదు. చీఫ్‌ గెస్టూ లండన్‌లోనే ఉన్నాడు.  అయినా కాన్వొకేషన్‌ అదిరిపోయింది. విద్యార్థులు ఒక్కొక్కరూ వేదిక మీదకు వచ్చి ఆనందంగా పట్టాలు అందుకున్నారు. ప్రొఫెసర్లూ ముచ్చటగా చూస్తుండిపోయారు. ఫంక్షన్‌ అయ్యాక అందరూ కలిసి గ్రూప్‌ ఫొటో కూడా దిగారు!

IIT Bombay convocation is celebrated with Virtual Reality
ఐఐటీ బాంబే స్నాతకోత్సవంలో వర్చువల్ రియాలిటీ

సాంకేతికతతో ఏదైనా సాధ్యమే మరి! కరోనాతో ఈసారి కాన్వొకేషన్‌ వేడుక ఉండదని ఉసూరుమంటున్న విద్యార్థుల్ని ఆనందంలో ముంచెత్తింది ఐఐటీ బాంబే. ‘వర్చువల్‌ రియాల్టీ’ సాంకేతికత సాయంతో వాళ్లకోసం ప్రపంచంలోనే తొలిసారి ఈ-కాన్వొకేషన్‌ని నిర్వహించి అదరగొట్టింది. సుమారు రెండువేలమంది విద్యార్థుల్ని ‘వర్చువల్‌’గా క్యాంపస్‌కి రప్పించి డిగ్రీలు అందించింది!

ఈ-కాన్వొకేషన్‌ అనగానే ఇది కూడా ఓ ఆన్‌లైన్‌ మీటింగ్‌లాంటిదని అనుకుంటున్నారేమో... ఇది వాటన్నింటినీ మించిన ఓ అపూర్వ ప్రయోగం! విద్యార్థులు ఇంట్లో ఉంటూనే అసలైన కాన్వొకేషన్‌లో పాల్గొన్న అనుభూతినిచ్చిన ‘వర్చువల్‌ రియాల్టీ’(వీఆర్‌) అద్భుతం. విద్యార్థులకు ఈ అద్భుతమైన అనుభూతిని అందించడం కోసం-ముందుగా ‘ఐఐటీ-బాంబే కాన్వొకేషన్‌ 2020’ యాప్‌ని తయారుచేశారు. కాన్వొకేషన్‌కి ముందురోజు దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ విద్యార్థులందరికీ సందేశాలు పంపారు. ఆ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు! ఎందుకంటే...

మనిషిక్కడ... మాటక్కడ...

సాధారణంగా మనం ఓ స్నాతకోత్సవానికి వెళితే ఏం చేస్తాం... అప్పటికే చాలారోజులుగా క్యాంపస్‌కి దూరమై ఉంటాం కాబట్టి అక్కడ మనకిష్టమైన ప్రదేశాలన్నీ చూసి వాటితో ముడిపడ్డ జ్ఞాపకాలన్నింటినీ నెమరేసుకుంటాం కదా! వర్చువల్‌ రియాల్టీతో అలా తమ విద్యార్థులూ క్యాంపస్‌లో తిరుగాడే అవకాశాన్ని కల్పించింది ఈ యాప్‌. వీఆర్‌తో ఈ మధ్య ఇలాంటివి అందరూ చేస్తున్నదే అంటారా! కానీ ఐఐటీ-బాంబే కేవలం వీడియోతోనే ఆగిపోకుండా ఒకడుగు ముందుకేసింది. ఆ వీడియోలో-మీలాగే ‘వర్చువల్‌’ క్యాంపస్‌ సందర్శనకి వచ్చిన మిగతా విద్యార్థులతో కబుర్లు చెప్పుకొనే అవకాశాన్నీ కల్పించింది. ఉదాహరణకి మీరు మీ హాస్టల్‌ని సందర్శించారని అనుకుందాం. మీలాగే ‘వర్చువల్‌’గా అక్కడికి వచ్చిన విద్యార్థుల 2డీ యానిమేషన్‌ బొమ్మ వీడియోలో డిస్‌ప్లే అయ్యేలా చేశారు. మీరు వాళ్లతో అప్పటికప్పుడు వీడియోకాల్‌ ద్వారా కనెక్ట్‌ అయ్యి... అందరూ కలిసి బాతాఖానీ చేస్తూ... ఆయా ప్రదేశాలని సందర్శించే అవకాశం కల్పించారన్నమాట!

ఆ వేదిక... యథాతథంగా!

ఇక అసలు స్నాతకోత్సవానికి వద్దాం! స్నాతకోత్సవమంటే ముందుగా ప్రొఫెసర్‌లందరూ వరసగా ‘ప్రొసెషన్‌’గా రావడం, వచ్చినవాళ్లందరూ వేదికపైన కూర్చోవడం, కూర్చున్నాక ఐఐటీ డైరెక్టర్‌ స్నాతకోత్సవం డిక్లేర్‌ చేయడం, ముఖ్య అతిథి రావడం, ప్రసంగించడం, డిగ్రీల ప్రదానం... వంటివి ఉంటాయికదా! వీటన్నింటినీ మీరూ, మీ ఫ్రెండ్స్‌ పక్కపక్కనే కూర్చుని ప్రత్యక్షంగా చూసేలాంటి అనుభూతిని కల్పించింది ఐఐటీ-బాంబే.

స్నాతకోత్సవ వేదికని యథాతథంగా కళ్లముందు నిలిపింది. ఇక, డిగ్రీలు అందుకునే ఘట్టాన్నయితే 3డీలో అద్భుతంగా మలిచారు. మీరు పట్టా తీసుకోవాల్సిన విద్యార్థి అనుకుందాం. మీరు మీ యాప్‌లో చూస్తున్నప్పుడు మీ 3డీ బొమ్మ వాటిని ముఖ్య అతిథి నుంచి నేరుగా అందుకునేలాగే చేయగలిగారు! మీదైన నవ్వూ, హావభావాలనీ ఆ బొమ్మలోకి తేగలిగారన్నమాట! అలా 2,400 మంది విద్యార్థులకీ డిగ్రీలని తామే ప్రత్యక్షంగా తీసుకున్న అనుభూతిని కల్పించారు! విద్యార్థులూ, ప్రొఫెసర్లూ అందరూ వర్చువల్‌గా ఒకేచోట కలిసి గ్రూప్‌ ఫొటో దిగడం కొసమెరుపు!

అన్నట్టు... 2016లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ అందుకున్న ప్రొఫెసర్‌ డంకన్‌ హల్దానే లండన్‌ నుంచే ముఖ్య అతిథిగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో ఈ వర్చువల్‌ కాన్వొకేషన్‌ పద్ధతిని ఎంతగానో కొనియాడారు. అంతేకాదు, ఈ కాన్వొకేషన్‌ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ‘సంప్రదాయాన్నీ, ఆధునికతనీ మేళవించిన అద్భుతం’ అంటూ ట్వీట్‌చేశారు!

రెండునెలల శ్రమ...

ఇంతగా ప్రశంసలందుకున్న ఈ సరికొత్త సాంకేతిక అద్భుతం వెనక రెండునెలల శ్రమ ఉంది! ఐఐటీ-బాంబే ఇండస్ట్రియల్‌ డిజైన్‌ సెంటర్‌(ఐడీసీ) ప్రొఫెసర్‌ సుమంత్‌ రావు ఈ మొత్తం వర్చువల్‌ కాన్వొకేషన్‌ని డైరెక్ట్‌ చేశారు. ఆయన, ప్రొఫెసర్‌ సుందర్‌, ప్రొఫెసర్‌ పరాగ్‌ చౌధురి, ప్రొఫెసర్‌ వర్షా ఆప్టే నేతృత్వంలోని దాదాపు పదిమంది విద్యార్థులు ఈ అద్భుతాన్ని సృష్టించారు. ముఖ్యంగా 2,400 మంది విద్యార్థుల ఫొటోలని ముందుగా (ముందు నుంచీ, కుడి, ఎడమ వైపుల నుంచీ) తీసుకుని వాళ్ల హావభావాలతో కూడిన 3డీ యానిమేషన్‌ బొమ్మల్ని రూపొందించడానికి ఈ విద్యార్థులు రాత్రింబవళ్లూ కష్టపడ్డారట. ఇందుకోసం క్యారెక్టర్‌ క్రియేటర్‌, ఐక్లోన్‌ సాఫ్ట్‌వేర్‌లని తమకి తగ్గట్టు ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకున్నారట.

‘అన్నింటికన్నా ప్రొఫెసర్‌లు వరసగా నడిచి వచ్చినట్టూ, ఓ మామూలు కాన్వొకేషన్‌లాగా పక్కపక్కనే కూర్చునేట్టూ చేయడానికి చాలానే శ్రమపడ్డాం. కరోనా కారణంగా వాళ్లందరిపైనా వేర్వేరుగా షూట్‌ చేసి... ఆ తర్వాత దగ్గరగా కూర్చున్నట్టు ఎఫెక్ట్‌ సృష్టించాం. ఈ ఒక్కదానికే వారం రోజులు పట్టింది. టీవీల్లో వీటిని చూసినవాళ్లందరూ ‘మీ ప్రొఫెసర్‌లు ఎవరూ భౌతిక దూరం పాటించలేదేమిటీ?!’ అని అడుగుతుంటే గర్వంగా అనిపిస్తోంది. దీనికి యూనిటీ అనే వీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ వాడినా మాదైన ముద్రవేశాం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచీ మాకు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి కాన్వొకేషన్‌లు తామూ నిర్వహించాలని ఎన్నో విశ్వవిద్యాలయాలు సలహాలు అడుగుతున్నాయి...’ అని చెబుతున్నారు ప్రొఫెసర్‌ సుమంత్‌ రావు.

భవిష్యత్తులో మిగతా విద్యాసంస్థలు ఇదేపద్ధతి అనుసరించినా, లేకపోతే కరోనా తగ్గి మామూలు కాన్వొకేషన్‌లే జరిగినా కూడా... ఈ స్నాతకోత్సవం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది! ఏమంటారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.