పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎంపికపై పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పేరు ప్రకటించిన వెంటనే మేడ్చల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోందని ఎంపీ కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.
పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డి ఎంపికపై స్పందించారు. ఓటుకు నోటు కేసులానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు దిల్లీ వెళ్లాక తెలిసిందని కోమటిరెడ్డి అన్నారు. పీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరెడ్డి... టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోందని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి.. ఆ ప్రయత్నం చేయొద్దు..
రేపట్నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. నల్గొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనను కొందరూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసిందన్న కోమటిరెడ్డి.. రేవంత్‌రెడ్డి సహా ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పారు. పీసీసీ కొత్త కార్యవర్గం హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని ఆశించానని.. కానీ వారికి అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో ఉంటే న్యాయం జరగదని కార్యకర్తలు భావించే పరిస్థితి ఉందన్నారు.
ఒకటే పార్టీలో ఉంటూ ప్రజల మధ్యన పనిచేశాను. పీసీసీ చీఫ్ ఎన్నికలో కార్యకర్తను గుర్తించి అవకాశం ఇస్తారని అనుకున్నా.. కానీ ఓటుకు నోటు కేసులో ఏ విధంగా జరిగిందో.. ఇక్కడా అలానే జరిగినట్లు దిల్లీ వెళ్లినప్పుడు తెలిసింది. ఒకటే పార్టీలో ఉంటే న్యాయం జరగదని.. వెంకటరెడ్డికి కూడా అన్యాయం జరిగిందని కార్యకర్తలు అనుకొనే ప్రమాదం ఉంది. నాకు కొద్దిగా బాధ ఉంది. రేపట్నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తా. రేవంత్‌రెడ్డి సహా ఎవరూ నన్ను కలిసేందుకు ప్రయత్నించొద్దు.
-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ.
మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా..
పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, రాహుల్ గాంధీలకు రాజినామా లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. ఏ పరిస్థితుల్లో తాను కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో.. లేఖల్లో వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తగా తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన పీసీసీ అధ్యక్షుడు ఈ కమిటీని పునర్న్యామకం చేసుకోడానికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్ రెడ్డి వివరించారు.
ఇదీచూడండి: