కేంద్రమంత్రుల సాక్షిగా భాజపా కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రప్రభుత్వంలో తనకు కనిపించిన ఏకైక మంచి మనిషి నితిన్ గడ్కరీ అని చెప్పారు. తెలంగాణ పురోగమిస్తున్న రాష్ట్రమని గడ్కరీ అన్నారని తెలిపారు. రహదారుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని గడ్కరీ లేఖ రాస్తే తాను వెళ్లానని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.
'ప్రభుత్వ కార్యక్రమం అని హైవే అథారిటీ వాళ్లు చెప్పారు. భాజపా కండువాలు వేసుకొని కార్యక్రమంలో 3 వేల మంది పాల్గొన్నారు. నేను ప్రసంగం ప్రారంభించగానే జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. నేను మాట్లాడితే భాజపా కార్యకర్తలకు అంత ఉలికిపాటు ఎందుకు? తెలంగాణకు రూ.8వేల కోట్లు గిఫ్ట్‌గా ఇస్తున్నామని అనడం మంచిది కాదు.' - ప్రశాంత్‌రెడ్డి, మంత్రి
తనను ఆపినంత మాత్రాన నిజాలు ఆగకుండా ఉంటాయా అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర వైఫల్యాలను అడుగుతాననే భయంతో తన ప్రసంగానికి ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. భాజపా కార్యకర్తలు చేసిన వ్యవహారానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తనకు క్షమాపణ చెప్పారని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. భాజపా కార్యకర్తల్లాగా తాము చేస్తే మీరు ఉంటారా అని నిలదీశారు.
ఏం జరిగిందంటే: హైదరాబాద్ శంషాబాద్‌లో హైవేల విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగానికి భాజపా శ్రేణులు ఆటంకం కలిగించారు. మంత్రి ప్రసంగిస్తుండగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయగా గందరగోళం తలెత్తింది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భాజపా కార్యకర్తలను వారించారు. అధికారిక కార్యక్రమంలో నినాదాలు వద్దని సూచించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు.
ఇదీ చదవండి : ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది: నితిన్ గడ్కరీ
పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి పెళ్లి ప్రపోజల్.. కాదంటే..!