ఈ నెల 9న విదేశీ ప్రముఖులకు అతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. విదేశీ వ్యవహారాలశాఖ అభివృద్ది కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు, హైకమిషనర్లు ఈ పర్యటనకు రానున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అడ్వాన్స్ బృందం ఛీఫ్ ప్రోటోకాల్ అధికారి నగేశ్ సింగ్, ప్రభుత్వ సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ పర్యటనలో ప్రఖ్యాత విదేశీ రాయబారులు, దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, బయోలాజికల్ సంస్థ పరిశ్రమ యూనిట్లను సందర్శిస్తారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
ప్రముఖుల పర్యటనకు కొవిడ్-19 ప్రోటోకాల్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన ఐదు బస్సులు, ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి హైదరాబాద్ ప్రత్యేకతను తెలిపే విధంగా ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీ వివరాలతో కూడిన ప్రజెంటేషన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : గ్రేటర్ ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్