Office Bubbles in Hyderabad Metro : మెట్రోరైలు స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థలాలను కార్యాలయాలకు అద్దెకివ్వనున్నారు. రిటైల్ దుకాణాల కోసం ప్రతి స్టేషన్‌లో స్థలాలు వదిలినప్పటికీ అంతగా స్పందన లేకపోవడంతో ప్రధాన స్టేషన్లలో కో వర్కింగ్ స్పేస్‌లుగా మారుస్తున్నారు. రవాణా ఆధారిత కార్యాలయ ప్రాంగణంగా ‘ఆఫీస్ బబుల్స్’ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. భారతీయ మెట్రోరైలు చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
- మూడు కారిడార్లలోని 57 మెట్రో స్టేషన్లలో 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అద్దెకు ఇచ్చేందుకు అందుబాటులో ఉందని తెలిపింది.
- 49 మెట్రోరైలు స్టేషన్లలో ప్రతిచోటా రెండు యూనిట్లలో 1750 చదరపు అడుగుల ప్రాంగణం అందుబాటులో ఉంది.
- అమీర్‌పేట, ఎంజీబీఎస్, మియాపూర్, నాగోల్, జేబీఎస్, పంజాగుట్ట వంటి పెద్ద స్టేషన్లలో 5వేల నుంచి 30వేల చదరపు అడుగుల స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
- నగరంలో వృద్ధి చెందుతున్న కోవర్కింగ్ ప్రాంగణాల డిమాండ్‌ను తీర్చడంతో పాటూ ప్రాంతం ఎంపికకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎల్ అండ్ టీ మెట్రో తెలిపింది. హబ్ అండ్ స్పోక్ నమూనాలో అందిస్తున్నట్లు వెల్లడించింది.
- పౌర సేవలు అందించే సంస్థలకు సైతం అనుకూలంగా ఉంటుంది. మలక్‌పేట స్టేషన్‌లో నగరంలోనే అతిపెద్ద ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెట్రోరైలు స్టేషన్లలో కార్యాలయాల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెట్రోలోనే వచ్చి తిరిగి అందులోనే ఇంటికి చేరుకోవచ్చు అని మెట్రో వర్గాలు అంటున్నాయి.