కరోనా నిర్ధరణ పరీక్షల్లో వేగం పెరగనుంది. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష విధానంలో చేసిన మార్పులు విజయవంతమయ్యాయి. ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్ దశ లేకుండా పరీక్షలు పూర్తి చేయవచ్చని.. తమ ప్రయోగం సత్ఫలితాలనిస్తోందని పరిశోధకులు అంటున్నారు. సమయంతో పాటు 40 శాతం వరకు ఖర్చు తగ్గుతోందని.. కచ్చితత్వం 20 శాతం ఎక్కువని చెబుతున్నారు.
ప్రస్తుతం 8 గంటలు
ప్రస్తుతం కరోనా ఉందో లేదో గుర్తించేందుకు ఆర్‌టీ-పీసీఆర్‌పై పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానంలో ఒక్కో పరీక్షకు 8 గంటలు పడుతోంది. వ్యయమూ ఎక్కువే. ఇప్పుడు చేస్తున్న విధానంలో రోగుల గొంతు, ముక్కులోంచి కఫం సేకరిస్తారు. దీన్ని ప్రత్యేక లిక్విడ్‌లో వేసి ప్రయోగశాలకు తీసుకెళుతున్నారు. ల్యాబ్‌కు తీసుకొచ్చాక కరోనా ఉందో.. లేదో తెలుసుకునేందుకు ఆర్‌ఎన్‌ఏను వేరు చేస్తారు. తర్వాత పీపీఆర్ పరీక్ష చేసి వైరస్ ఉందో, లేదో నిర్ధరిస్తారు.
రెండున్నర గంటల్లోనే ఫలితాలు
సీసీఎంబీ పరిశోధక బృందం రోగి నుంచి సేకరించిన నమూనాలను ఎలాంటి లిక్విడ్‌లో కలపకుండా (డ్రైస్వాబ్స్)సేకరించి.. ప్రయోగశాలకు వచ్చాక లిక్విడ్‌లో వేస్తున్నారు. తర్వాత ఆర్‌ఎన్‌ఏ ప్రక్రియ లేకుండా నేరుగా పీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. ఈ విధానంలో రెండున్నర గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయి. కొవిడ్ పరీక్షల విధానాన్నే సమూలంగా మార్చే సరికొత్త విధానాన్ని ధ్రువీకరణకు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కి పంపనున్నారు. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా నేతృత్వంలో శాస్త్రవేత్త కష్ణన్ హెచ్ హర్షన్, పరిశోధక విద్యార్థులు ఉదయ్‌కిరణ్, గోఖలె, సంతోష్‌కుమార్, దివియ వేదగిరి, కార్తీక్ భరద్వాజ్ సమర్పించిన పరిశోధన పత్రం తాజాగా బయోఆర్కైవ్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా కేసులు.. నలుగురు మృతి