వ్యవసాయ వినియోగదారులు మినహా మిగతా వారంతా స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేసుకోవల్సిందిగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు సైతం ఈ మీటర్లను బిగించవలసి ఉంటుంది.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే..
రాష్ట్రంలో ఇప్పటికే 10వేలకు పైగా స్మార్ట్‌మీటర్లు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా జీడిమెట్ల పరిధిలో స్మార్ట్‌గ్రిడ్ కింద 8,800 మంది వినియోగదారులకు వీటిని అందజేశారు. మిగిలినవి ప్రభుత్వకార్యాలయాల్లోనూ అమర్చారు. కేంద్రం సూచించినట్లుగా స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది.
ఈఆర్‌సీ మార్గదర్శకాలివీ..
స్మార్ట్‌గ్రిడ్ రెగ్యులేషన్స్(2021) పేరిట ఈఆర్‌సీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విధానంలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ఒక భాగం. దానితో పాటు మైక్రోగ్రిడ్లు, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయటం, విద్యుత్ నిల్వ, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌కు చేరవేయటం, స్మార్ట్ గ్రిడ్ సమాచార సేకరణ, విశ్లేషణ వంటి ఇతర అంశాలుంటాయి. ఈఆర్‌సీ 2016లో ఒకసారి, 2020లో మరోసారి కమిషన్ ముసాయిదా నిబంధలను రూపొందించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. తాజా మార్గదర్శకాలు తెలంగాణ గెజిట్‌లో ప్రచురితమైన నాటి నుంచి అమలులోకి వస్తాయి.
విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చిన మూడు నెలల్లోగా స్మార్ట్‌గ్రిడ్ సెల్‌ను ఏర్పాటుచేయాలి. స్మార్ట్‌గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలను రూపొందించటం, లాభసాటిగా ఉండే మార్గాలను అనుసరించటం, కొత్త వ్యూహాలను ఆచరించటం, కమిషన్‌తో ఉత్తరప్రత్యుత్తరాల్లో భాగస్వామ్యం వహించటం వంటి బాధ్యతలు చూడవలసి ఉంటుంది.
- నిర్దేశిత ప్రాంతంలో వినియోగదారులకు అందించే సేవలు, ధరవరలకు సంబంధించిన పూర్తి ప్రణాళిక..మల్టీ ఇయర్ టారిఫ్ పిటిషన్(ఏఆర్‌ఆర్ పిటిషన్)లను కమిషన్‌కు ముందుగా సమర్పించాలి.
- స్మార్ట్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు రూ.20కోట్ల కంటే ఎక్కువ వ్యయమైన పక్షంలో తప్పక కమిషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది.
- కమిషన్‌కు సమర్పించే ప్రతిపాదనల్లో తప్పనిసరిగా ప్రాజెక్టు రిపోర్టు, వినియోగదారుల భాగస్వామ్యం, సామర్థ్యం మెరుగుపరిచే శిక్షణ కార్యక్రమాలు తదితరాల వివరాలుండాలి.
- పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టేందుకు డిస్కంలకు, ట్రాన్స్‌కోలకు అనుమతి ఇచ్చింది. డిస్కంలకు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 0.01 శాతం, ట్రాన్స్‌కో, లోడ్ డిస్పాచ్ సెంటర్‌ల ఏఆర్‌ఆర్ ఆదాయంలో 0.5 శాతం వరకూ ఇందుకు వెచ్చించవచ్చు.