భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరిణి సావిత్రిబాయి పూలే అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లో బహుజన సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే జయంతి సభలో జస్టిస్ పాల్గొని... వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు.
మేధావులందరికీ సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసునని... కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి... వారి విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి.. గొప్ప రచయిత్రి అని కొనియాడారు. సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పదన్నారు. ఆమె తన భర్తకు తోడునీడగా నిలిచిందని.. స్వయంగానే ఆమె సామాజిక విప్లవ మాతృమూర్తి అని తెలిపారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుందని చంద్రయ్య కొనియాడారు.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్ బయోటెక్