నియంత్రిత సాగు విధానం... రంగారెడ్డి జిల్లా ఉద్యాన రైతులకు వరంగా మారబోతుంది. రాజధాని వాసుల కూరగాయల కష్టాలను తీర్చబోతుంది. నిత్యం ఆదాయాన్ని తెచ్చిపెట్టే కూరగాయల సాగును... మరింత ప్రోత్సహించి రైతుల ఇంట సిరులు కురిపించేందుకు... ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలో అవసరానికి మించి... టమాట, బెండకాయ, వంకాయ సాగవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నగరానికి సరఫరా అయ్యే కూరగాయల్లో... ఏ నెలలో ఏ కూరగాయలకు లోటు ఉంది, ఏవి ధరలు పెరుగుతున్నాయో గుర్తించి... వాటి సాగును ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారులకు సూచించింది. పంట ఉత్పత్తుల్లో సమతుల్యత పాటించేలా చూడాలని ఆదేశించింది. ఆ సూచనలకు అనుగుణంగా 2020-21 ఏడాదికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు... ప్రస్తుత సాగుకు అదనంగా మరో 10 వేల ఎకరాల్లో... కూరగాయలు, పండ్ల సాగు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో 88, 681 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధద్రవ్యాలు, సెరికల్చర్, ఆగ్రోఫారెస్టీ సాగు చేస్తున్నారు. వాటిలో అత్యధికంగా 53, 781 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా... అదనంగా మరో 10, 010 ఎకరాల్లో కూరగాయలు సాగుచేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో 63, 931 ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి అదనంగా 1,100 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆగ్రోఫారెస్టీ 1,500 ఎకరాల్లో, సెరికల్చర్ 200 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా అదనంగా 13 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని నిర్ణయించిన ఉద్యానశాఖ... ఆయా పంటల సాగు ఓకేసారి కాకుండా సీజన్ల వారీగా వేసేలా రైతులను చైతన్యపరచాలని భావిస్తోంది.
మార్కెట్‌లో డిమాండ్‌తోపాటు.. పొలంలో పండించేందుకు అనుకూలంగా ఉండే పంటలు రైతులు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వానాకాలం పంటలో టమాట, వంగ, బెండ, పచ్చిమిర్చి, తీగజాతి కూరగాయలు సాగు చేయాలంటున్న అధికారులు... పందిరి కూరగాయలపై కూడా దృష్టి సారించాలంటున్నారు.
ఇదీ చూడండి:ఏజీఆర్ బకాయిలు చెల్లించండి.. కష్టాల్లో ఉన్నాం ప్లీజ్!