లాక్‌డౌన్ (lockdown)తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించడంతో... ఆదాయం నిలిచిపోయింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మిగతా పనులకు నిధులు కావాల్సి ఉండగా... ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పులూ తీసుకుంటోంది. ఈఏడాదిలో ఇప్పటికే రూ.15,500 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, భూమి విలువ పెంపు అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని విలువైన భూములను అమ్మి... ఆదాయం పొందాలని భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 64.93 ఎకరాల భూమిని అమ్మేందుకు ఇవాళ్టి నుంచి వేలం జరగనుంది. ఈ భూముల విక్రయం ద్వారా దాదాపు రూ.1600 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కోకాపేటలోని 49.92 ఎకరాలు..
కోకాపేటలోని 49.92 ఎకరాల భూమికి సంబంధించి 8 ప్లాట్లకు ఇవాళ ఈ-ఆక్షన్(E-Action) జరగనుంది. ఈ వెంచర్ పేరును నియోపోలీస్‌గా హెచ్ఎండీఏ (HMDA) అధికారులు నామకరణం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు(ORR) దగ్గరగా, మంచి ప్రాంతంలో ఉండటంతో బిడ్ వేసేందుకు అధికంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం ఎకరానికి కనీసం రూ.25 కోట్ల రూపాయల ధరను నిర్ణయించింది. ఇక్కడ 6 ప్లాట్లు ఏడు, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండగా... రెండు ప్లాట్లు మాత్రమే ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్నాయి.
ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాలు..
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ(TSIIC)కి చెందిన హైటెక్ సిటీ(HITECH CITY) సమీపంలో ఉన్న ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 5 ప్లాట్లకు రేపు వేలం నిర్వహించనున్నారు. ఇక్కడున్న అన్ని ప్లాట్లు 2, 3 ఎకరాల చొప్పున విస్తీర్ణంలో ఉన్నాయి. ఎకరానికి కనీస వేలం ధర రూ. 25 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం... రూ.20 లక్షల చొప్పుల వేలం పెంచుకోవచ్చని ప్రకటించింది. కనీస ధరకు భూముల విక్రయం అయినా రూ.1623 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి.
భూములన్ని బహుళ ఉపయోగ జోన్లో..
ప్రస్తుతం విక్రయిస్తున్న భూములన్నీ బహుళ ఉపయోగ జోన్ కిందకు వస్తాయి. అంటే ఈ భూములను ఆఫీస్, ఐటీ, గృహ, విద్యా సంస్థలు, కమర్షియల్ వినియోగం కోసం ఈ భూములను ఉపయోగించుకోవచ్చు. భూముల వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎమ్ఎస్టీడీ (MSTC) వెబ్ సైట్ ద్వారా జరగనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లాంటి వాణిజ్య ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఈ భూముల వేలం విజయవంతంగా సాగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కోకాపేటలోని నియోపోలీస్ లేఅవుట్‌ను హెచ్ఎండీఏ (HMDA) ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసింది.
గోల్డెన్ మైల్
గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినపుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈసారి దీనికి మించి రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధరపలికే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు వేలంలో పాల్గొంటున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నియోపోలిస్ వెంచర్ (Neopolis Kokapet Venchar) ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ (Chief Secretary of the Municipal Department Arvind Kumar) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వెంచర్ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్ మైల్ (Golden Mile)అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
సంబంధిత కథనం: TS HIGH COURT: హైకోర్టులో విజయశాంతికి చుక్కెదురు!