తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ(Telangana RTC)కు సంబంధించిన నిర్ణయాలను అధికారులు ఓ వింత ధోరణితో తీసుకుంటున్నారు. సంస్థకు సంబంధించి లాభనష్టాలు బేరీజు వేసుకుని, ఏం చేస్తే ప్రగతి సాధిస్తామో ఆలోచించి ఆచితూచి అడుగులేయాల్సిన అధికారులు.. మూఢవిశ్వాసాలను నమ్ముతూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. వారి ప్రవర్తన చూసి ఉద్యోగ సంఘాలు విస్మయానికి గురవుతున్నాయి. సంస్థ ప్రధాన కార్యాలయంలో మూఢనమ్మకాలు విశ్వసిస్తూ ఆ దిశగా చర్యలు చేపడుతూ.. అంతా మంచే జరుగుతుందని, అలా చేస్తేనే తెలంగాణ ఆర్టీసీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని గుడ్డిగా నమ్ముతున్నారు. వారి తీరుని చూసి చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.
బస్‌భవన్‌లో వింత మార్పులు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana RTC)లో ఇటీవల కాలంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిస్థాయి ఎండీ లేకుండా.. మూడేళ్లుగా నెట్టుకొస్తున్న ఆర్టీసీకి ఎండీగా సజ్జనార్‌ను, ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. ఒక్కసారిగా ఆర్టీసీకి ఎండీ, ఛైర్మన్ నియామకం కావడంతో బస్ భవన్లో సందడి నెలకొంది. ఈ సందడితో పాటు ఉన్నతాధికారులు తీసుకున్న కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ((Telangana RTC md sajjanar)గా వీసీ సజ్జనార్ సెప్టెంబర్ 3న ద్వాదశి, శ్రావణ మాసం, శుక్రవారం ఉదయం 9 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఛైర్మన్(Telangana RTC chairman bajireddy govardhan reddy)గా బాజిరెడ్డి గోవర్ధన్ సెప్టెంబర్ 20న ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆరోజు పౌర్ణమి ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం వెళ్లిన తర్వాత 9.15 నిమిషాలకు బాజిరెడ్డి ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు.
వాస్తు మార్పులు..
ఎండీ, ఛైర్మన్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నతాధికారులు బస్ భవన్(Telangana RTC Bus Bhavan)లో కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. బస్ భవన్(Telangana RTC Bus Bhavan) నిర్మించినప్పటి నుంచి ఆగ్నేయ దిక్కున ఉన్న ప్రధాన గేటునే ఉపయోగించారు. కానీ.. ఇప్పుడు కొత్తగా ఈశాన్యం దిక్కున ఉన్న గేటు మాత్రమే ఉపయోగించాలని ఉన్నతాధికారుల నుంచి సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ అవ్వడం వల్ల ఆగ్నేయం గేటుకు తాళం పడింది. ఈ విషయం తెలియని బస్ భవన్(Telangana RTC Bus Bhavan) సిబ్బంది, సందర్శకులు ఆగ్నేయం గేటు దగ్గరకు వాహనాల్లో వచ్చి వెనుదిరుగుతున్నారు. ముషీరాబాద్ బస్ డిపోల వైపు ఉండే గేటు ద్వారా లోపలికి వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు.
ఇదేం వింత..
ఎందుకు ప్రధాన గేటు తెరవడం లేదని ప్రశ్నిస్తే.. అధికారుల ఆదేశాల మేరకే మూసివేసినట్లు చెబుతున్నారు. వాస్తు పేరుతో ఇలా గేట్లకు తాళాలు వేయడం, దారులు మార్చడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కార్మికసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఆ నిర్ణయాలు భేష్..
మరోవైపు.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా ఛైర్మన్, ఎండీలు తీసుకున్న నిర్ణయాలు సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా మారాయి. సొంత వాహనాలు వాడటం, వృథా ఖర్చు తగ్గించడం, భోజనం, టిఫిన్స్, ఇతరత్రా ఖర్చులు సంస్థ నుంచి పెట్టొద్దని సూచించడం మంచి నిర్ణయాలని కార్మికులు పేర్కొంటున్నారు.