ఏ ప్రాజెక్టు గేటు పాడైనా, కాల్వకు గండిపడినా... చెరువుకు బుంగ పడినా వెంటనే మరమ్మతు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన నిధులు ఇంజినీర్ల వద్ద అందుబాటులో ఉంచనుంది. నీటిపారుదల శాఖలో ఆపరేషన్-మెయింటినెన్స్ (ఓఅండ్‌ఎం) విభాగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న సర్కారు రాష్ట్రంలోని 84 జలాశయాలతోపాటు ఎత్తిపోతల పంపులు, కాల్వల బాగోగులను ఈ విభాగం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓఅండ్‌ఎం పాత్రపై నీటిపారుదల శాఖ కసరత్తు ఆరంభించింది. ఈఈల స్థాయి నుంచి సీఈల వరకు అభిప్రాయాలు స్వీకరించి ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తోంది.
ఏటా రూ.280 కోట్ల కేటాయింపు
ఇప్పటి వరకు నీటిపారుదల శాఖలో నిర్వహణ కోసమంటూ ప్రత్యేకంగా నిధులు లేవు. అత్యవసరమైనా, మున్ముందు అవసరాలకైనా క్షేత్రస్థాయి ఇంజినీరు నుంచి ప్రతిపాదనలు సీఈల ద్వారా ఈఎన్‌సీకి చేరి ప్రభుత్వం ఆమోదం లభిస్తేనే నిధులు విడుదలయ్యేవి. చేసిన పనులకు బిల్లులు రావడానికి చాలా సమయం పట్టేది. దీంతో అత్యవసర పనులు కూడా నిలిచిపోయేవి. కాల్వల్లో పూడిక, జలాశయాల గేట్ల మరమ్మతు, తూముల తలుపుల బిగింపు, బుంగలు పూడ్చటం లాంటి పనులకు కూడా టెండర్లు పిలిచి చేసేవారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా అమలు చేస్తున్న ఓఅండ్‌ఎం విధానంలో త్రైమాసికానికి రూ.70 కోట్ల చొప్పున ఏటా రూ.280 కోట్లను కేటాయించనున్నారు. ఈ నిధుల నుంచి అత్యవసర పనులకు వెను వెంటనే ఖర్చు చేయవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం నాగేంద్రరావును నియమించారు.
డీఈఈ స్థాయిలో రూ.2 లక్షలు
అత్యవసర పనులకు క్షేత్రస్థాయిలో డివిజనల్ ఇంజినీరు రూ.2 లక్షలు, కార్యనిర్వాహక ఇంజినీరు స్థాయిలో రూ.5 లక్షలు వెనువెంటనే ఖర్చు చేసేందుకు అధికారం కల్పించారు. ఎస్‌ఈ, సీఈ స్థాయిలో ఈ పరిధి మరింతగా ఉంది. అవసరమైతే ఈఎన్‌సీ స్థాయిలో ఆమోదం తీసుకుని మరిన్ని నిధులు అత్యవసరంగా ఖర్చుచేయడానికి వెసులుబాటు కల్పించారు. ప్రతిపాదనలు, ఆమోదం, మంజూరు లాంటివి క్షణాల్లో జరిగిపోయేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఏ పనికి ఎంత వ్యయం, అంచనాలు ఎవరు ఖరారు చేయాలి, నిధులు మంజూరుకు ఆమోదం ఎవరు ఇస్తారు, ఎవరు ఎంబీ నమోదు చేయాల్సి ఉంటుంది, ఆడిట్ ఎవరు చేస్తారనేదానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18 లోపు ప్రతి విభాగం విధులు, పర్యవేక్షణ, జవాబుదారీతనం లాంటి వాటిపై మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. నిధుల నిర్వహణ ఖాతా (హెడ్) ఎక్కడుండాలనేది ఖరారు చేయనున్నారు.
ఎత్తిపోత.. విద్యుత్తు వినియోగంపై మథనం
రాష్ట్రంలో ఎత్తిపోతల్లో విద్యుత్ వినియోగం.. దాని ఫలితంపై నీటిపారుదల శాఖ మథనం చేస్తోంది. లిఫ్టును నడిపేందుకు అయ్యే విద్యుత్తు వినియోగం, ఖర్చుకు సమానంగా.. ఎత్తిపోసిన నీటితో పంటల సాగు అవుతుందా లేదా అనేది అంచనా వేస్తోంది. దీనికోసం జెన్‌కో అనుసరిస్తున్న నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేస్తోంది. ఎత్తిపోతల పంపుహౌస్‌ల నిర్వహణకు ఎలక్ట్రో, మెకానికల్ సిబ్బంది నియామకం చేపట్టాలని భావిస్తున్నారు.
జగిత్యాల సీఈ పరిధిలోకి ఎస్సారెస్పీ
నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణలో 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలను కూడా ఖరారు చేయడం కొలిక్కి వచ్చింది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలన్నీ నిజామాబాద్ ప్రాంతంలో ఉండగా ఆయకట్టు జగిత్యాల, కరీంనగర్, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిధిని జగిత్యాల సీఈకి అప్పగించారు. జూరాల ప్రాజెక్టును వనపర్తి సీఈ పరిధిలో చేర్చారు. ఇలా పలు ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల పరిధిని ఖరారు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : జలాశయాల పటిష్ఠతకు నిధులు..