వామన్ రావు, నాగమణి దంపతుల హత్యల కేసు దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. సకాలంలో ఛార్జిషీటు దాఖలయ్యేలా చూడాలన్నది తమ ఉద్దేశమని తెలిపింది. న్యాయవాది దంపతుల హత్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. దర్యాప్తు వివరాలతో రామగుండం పోలీసులు మూడో స్థాయి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు నివేదికలో పోలీసులు వివరించారు.
ఇప్పటి వరకు 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించగా.. వారిలో 26 మంది వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్టు హైకోర్టుకు పోలీసులు తెలిపారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్‌తో పాటు ఓ సాక్షికి చెందిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్టు పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి సుమారు 4 వారాలు పట్టే అవకాశం ఉందని అడ్వొకేట్ జనరల్ బీ ఎస్ ప్రసాద్ తెలిపారు. మే 17 నాటికి హత్య జరిగి 90 రోజులు అవుతుందని.. అప్పటిలోగా సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందని ఏజీ తెలిపారు.
పోలీసుల నివేదికలు తమకు కూడా ఇచ్చేలా ఆదేశించాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు తరఫు న్యాయవాది కోరారు. వామన్ రావు తండ్రి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు... దర్యాప్తు పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే తాము నివేదికలు తెప్పించుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. సకాలంలో ఛార్జిషీట్ దాఖలయ్యేలా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. దర్యాప్తు తాజా వివరాలతో మరో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.