గ్రేటర్ హైదరాబాద్‌లో వరదసాయం పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. వరదసాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి కేటాయించిన 550 కోట్ల రూపాయల పంపిణీలో అక్రమాలు జరిగాయని లేఖలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టి తెరాసకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులే పది వేల రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు.
అసలైన బాధితులకు సాయం అందలేదని.. చాలా మంది అనర్హులు లబ్ధి పొందారన్నారు. లేఖను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. పిల్‌పై సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: 'నెలాఖరులోగా ఉద్యోగుల పదోన్నతులు పూర్తి చేయాలి'