నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై విచారణ నివేదిక సమర్పించకపోవడం పట్ల ఇంటర్మీడియెట్ బోర్డు తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనేక నిబంధనలు ఉల్లంఘించి కాలేజీలు నిర్వహిస్తున్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన రాజేశ్ అనే సామాజిక కార్యకర్త గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. శ్రీచైతన్య 45, నారాయణ విద్యా సంస్థలు 46 కళాశాలలు నిర్వహిస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును డిసెంబరు 18న హైకోర్టు ఆదేశించింది. పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఆదేశాలు ఇచ్చినప్పటికీ విచారణ నివేదిక ఎందుకు సమర్పించలేదని ఇంటర్ బోర్డుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ రెండు విద్యా సంస్థలకు చెందిన కాలేజీలు ఎన్ని ఉన్నాయి.. వాటిలో అనుమతి లేనివి ఉన్నాయా తదితర పూర్తి వివరాలతో ఈనెల 17లోగా నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.