AP High Court on APSLDC : గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం ఏర్పాటుచేసిన పవన, సౌర సంస్థల విద్యుదుత్పత్తిలో కోతపెట్టడంపై ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(APSLDC) తీరును ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. డిమాండ్‌కు మించి విద్యుత్ ఉత్పత్తి అయితే కేవలం పవన, సౌర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో మాత్రమే కోతపెట్టడం.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు అదుపుచేయలేదని ప్రశ్నించింది. ఏ సంస్థకు ఎంత కోతపెట్టారు? ఎవరి దగ్గర్నుంచి ఎంత కొనుగోలు చేశారు? అనే పూర్తి వివరాలు లెక్కలు తేలిస్తే దురుద్దేశంతో వ్యవహరించారా లేదా ? అనేది తేలుతుందని పేర్కొంది.
APSLDC News : పవన, సౌర సంస్థల విద్యుత్‌ను తీసుకోవడంలో కోతపెట్టి.. థర్మల్ విద్యుత్‌ను ప్రోత్సహించడం చూస్తుంటే కాలుష్యం పెంపునకు ఏపీఎస్‌ఎల్‌డీసీ తన వంతు తోడ్పడినట్లుందని వ్యాఖ్యానించింది. మంగళవారం జరిగిన విచారణలో ఎస్ఎల్డీసీ, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
AP High Court Serious on APSLDC : గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్ ధరలపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం తుది విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై గత కొద్ది రోజులుగా హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. తాజాగా జరిగిన విచారణలో ఎస్ఎల్డీసీ తరపు న్యాయవాది పునీత్ జైన్ వాదనలు వినిపించారు. విద్యుత్ డిమాండ్.. సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. గ్రిడ్ రక్షణలో భాగంగా పవన, సౌర విద్యుత్ సంస్థల ఉత్పత్తిలో కోతపెట్టామని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.