నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చిన వారిపై పోలీసులు దాడులు చేసిన ఘటనలపై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 16లోగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనలో ఓ నివేదిక.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై మరో నివేదిక సమర్పించాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కొన్ని చోట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని.. అలాంటి ఘటనలపై కేసులు నమోదు చేయాలని కోరుతూ న్యాయవాది ఉమేష్ చంద్ర రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్ నాథ్ల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. వనపర్తిలో ఈనెల 2న పదేళ్ల కుమారుడి ఎదుటే మురళీ కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయవాది వివరించారు. లాక్ డౌన్ సందర్భంగా అక్కడక్కడ జరిగిన కొన్ని దురదృష్ట ఘటనలు చోటు చేసుకోవచ్చు కానీ.. మొత్తం మీద తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో.. చట్టాలను ఉల్లంఘించిన వారి పట్ల పోలీసులు చర్యలు తీసుకోక తప్పదని పేర్కొంది. అయితే పోలీసులు కూడా నిబంధనల పరిధిలోనే వ్యవహరించాలని... ప్రజలు ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చారో తెలుసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కరోనా కట్టడిలో 'కేరళ మోడల్' సూపర్ హిట్!