బంగారు, వజ్రాభరణాలు సులభంగా ఇస్తామంటూ 18 దేశాల్లో ప్రచారం నిర్వహించి... మదుపరుల నుంచి 5వేల కోట్లు స్వాహా చేసిన హీరాగోల్డ్ అధినేత్రి నౌహీరా షేక్ లీలలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. ఖాతాదారుల సొమ్ము సొంత ఖాతాలు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసేందుకు నౌహీరా షేక్ వేల సంఖ్యలో లావాదేవీలు నిర్వహించింది. ఏడాదిలో 2లక్షల లావాదేవీలు నిర్వహించడం చూసి సీసీఎస్ పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.
రెండు కార్పొరేటు బ్యాంకులు, మరో రెండు ప్రైవేటు బ్యాంకుల్లో హీరాగ్రూప్ కంపెనీల బ్యాంకు ఖాతాలున్నాయి. వీటి ద్వారా తొమ్మిది నెలల వ్యవధిలో నౌహీరా షేక్ 275 కోట్ల రూపాయల నగదు విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నౌహీరా షేక్ ఖాతాల్లో 255 కోట్లు, ఆమె కుటుంబసభ్యుల ఖాతాల్లో 20 కోట్ల నగదు జమ చేశారు. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ బ్యాంక్ ద్వారా ఏడాది వ్యవధిలో ఆమె లక్షా 60వేల లావాదేవాలను నిర్వహించినట్లు గుర్తించారు.
దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్, అబుదాబిలో నివాసముంటున్న భారతీయులు హీరాగోల్డ్లో మదుపు చేశారు. రెండు నెలల పాటు వారికి బంగారు, వజ్రాభరణాలు ఇవ్వక పోగా... మదుపు చేసిన సొమ్ముకు వడ్డీ ఇస్తానంటూ నౌహీరా షేక్ వారికి చెప్పింది. నెలనెలా వారి బ్యాంక్ ఖాతాల్లో వడ్డీ జమచేయించి... కొంతకాలం తర్వాత ఆపేసింది. ఆ డబ్బులు స్వాహా చేసేందుకు పథకం ప్రకారం హీరా టెక్స్టైల్స్, హీరాఫుడ్స్ నగదు నిల్వలు హీరాగోల్డ్ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఆ కంపెనీ ఖాతాల్లోంచి తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మల్లించగా... వారు 15 రోజుల్లో విత్ డ్రా చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'హెల్మెట్ లేని ప్రయాణం- రాహుల్, గడ్కరీకి ఫైన్!'