రాష్ట్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు వరద పెరిగింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లోకి గరిష్ఠస్థాయి నీటి మట్టం చేరుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిపై ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు అన్నిచోట్లా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీరామసాగర్ మొదలుకొని అన్ని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం ఉంది.
మేడిగడ్డ 39 గేట్లు ఎత్తివేత..
మేడిగడ్డ బ్యారేజిలో 85 గేట్లకు 39 గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 1,45,90 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా.. 39 గేట్ల ద్వారా 1,72,560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16 .17 టీఎంసీలకు ప్రస్తుతం.. 13 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.
అన్నారం బ్యారేజీలోకి 45వేల క్యూసెక్కుల నీరు..
లక్ష్మీపంప్ హౌస్ ద్వారా సరస్వతి బ్యారేజికి నీటిని ఎత్తి పోయగా.. పై నుంచి వరద ప్రవాహం ఉండడం వల్ల ఎత్తి పోసిన నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజికి ఎగువప్రాంతం నుంచి 45,000 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. 20 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు పంపిస్తున్నారు.
నిండుకుండలా ఎస్సారెస్పీ..
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులో 1,83,883 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రాజెక్టు అధికారులను సంప్రదిస్తూ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో వివరాలు తెలుసుకుంటున్నారు.
మేడిగడ్డ నుంచి నీరు విడుదల..
మొన్నటివరకు గోదావరికి వరద లేకపోవడంతో ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయగా, ఇప్పుడు ఎత్తిపోత నిలిపివేసి దిగువకు వదలాల్సి వస్తోంది. కృష్ణాలో ఎగువన ఉన్న ఆలమట్టిలోకి ప్రవాహం పెరిగి నారాయణపూర్ నుంచి నీటి విడుదల పెరిగింది. దీంతో గురువారానికి జూరాలకు ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
మూసీ గేట్లు ఎత్తివేత..
కృష్ణాలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ రెండూ నిండటానికి 360 టీఎంసీలు అవసరం. ఆలమట్టిలోకి భారీగా ప్రవాహం వస్తే ఈ రెండింటి పరిస్థితి మెరుగవుతుంది. స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రవాహం పెరిగి మూసీ నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. గోదావరిలో ఎగువన ఉన్న శ్రీరామసాగర్‌లోకి బుధవారం ఉదయం 6 గంటలకు 80 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, సాయంత్రం ఆరు గంటలకు 52,591 క్యూసెక్కులకు తగ్గింది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 53.54 టీఎంసీలు ఉంది. సింగూరులోకి 2,425 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నిజాంసాగర్‌లోకి ఏమీలేదు.
కడెం నుంచి నీటి విడుదల
దిగువన ఉన్న కడెం ప్రాజెక్టుకు 18,892 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, గేట్లు ఎత్తి 16,686 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లికి వదిలారు. ఎల్లంపల్లికి 24,408 క్యూసెక్కులు రాగా, గేట్లు ఎత్తి 16,686 క్యూసెక్కులు నదికి వదిలారు. మధ్యమానేరు, దిగువ మానేరు రిజర్వాయర్‌లలో నీటినిల్వలు మెరుగ్గా ఉండటంతో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడం కొన్ని రోజులుగా నిలిపివేశారు. ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన నీటి నుంచి 7,593 క్యూసెక్కులు, స్థానిక వాగుల నుంచి వచ్చే 957 క్యూసెక్కులు కలిపి 8,150 క్యూసెక్కులు సుందిళ్లలోకి వస్తుండటంతో పది గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్కులు అన్నారం బ్యారేజీకి వదిలారు. ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల పెరిగినందున సుందిళ్లలోకి మరింత ఎక్కువగా ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.
పార్వతి బ్యారేజ్ 20 గేట్లు ఎత్తివేత
గోదావరి నదికి అనుసంధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి బ్యారేజ్ నుంచి 20 గేట్లను ఎత్తి 10,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. నెలరోజులుగా సరస్వతి పంపు హౌస్ నుంచి మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోయడం.. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల వచ్చిన నీటితో పార్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. ఈ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు. ప్రస్తుతం 6.757 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టుల్లోకి ప్రవాహం..
అన్నారంలోకి మానేరు, స్థానిక వాగుల నుంచి 7,700 క్యూసెక్కులు వస్తుండగా, 4,500 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ప్రవాహం పెరిగే కొద్దీ నీటివిడుదల పెంచనున్నారు. మేడిగడ్డ వద్ద సుమారు లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దీంతో 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో మానేరు తదితర నదుల నుంచి ఎక్కువ ప్రవాహం ఉంది.
తాలిపేరు గేట్లు ఎత్తివేత..
గోదావరిలో దిగువన తాలిపేరు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది జలకళ సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా జలాశయంలోరి వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం వద్ద 55,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 47,000 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు.
కృష్ణా బేసిన్‌లో ఇలా..
కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న ఆలమట్టి జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్టులోకి 81వేల 944 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిలువ 123.08 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 93.125 టీఎంల వరకు నీరు నిల్వ ఉంది.
ప్రవాహం పెరుగుతూ ఉండటం వల్ల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు విడుదల చేశారు. 55 వేల క్యూసెక్కుల మీరు ఈ ప్రాజెక్టులోకి చేరుతుండగా.. 9 గేట్లు ఎత్తి 57,120 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 33.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నారాయణపూర్ నుంచి జూరాలకు 12,500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.276 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి దిగువకు 1,251 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జూరాలలో 2 యూనిట్ల చొప్పున విద్యుదుత్పత్తి జరుగుతోంది.
శ్రీశైలం నీటిమట్టం 807.7 అడుగులకు చేరింది. 250 క్యూసెక్కులు వస్తుండగా, విద్యుదుత్పత్తి ద్వారా 7,000 క్యూసెక్కులు వదులుతున్నారు.
నాగార్జునసాగర్‌లోకి 450 క్యూసెక్కులు రాగా, ఈ నీటిని వదులుతున్నారు. పులిచింతలలోకి 3,350 క్యూసెక్కులు రాగా, 600 క్యూసెక్కులు వదిలారు. వరద నీరు వస్తున్న కారణంగా నది పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 5,132 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు
- ఇదీ చదవండి : RAINS: రాజధానిలో కుంభవృష్టి.. నీటమునిగిన కాలనీలు