భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మూసీపై ఉన్న ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో వాటి గేట్లు తెరిచి దిగువకు వరదను వదులుతున్నారు. వివిధ జలాశయాల గేట్లు తెరుస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
220 కుటుంబాలకు..
మూసీని ఆనుకొని ఉండే తీగలగూడ కాలనీలో సుమారు 220 కుటుంబాలు నివసిస్తాయి. కాలనీకి వరద ముంపు నెలకొంది. ఇక్కడ గతేడాది వరదల్లో 60 గుడిసెలు కొట్టుకుపోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అంబేడ్కర్‌వాడ, శాలివాహననగర్ తదితర ముంపు కాలనీల్లో మరో 320 కుటుంబాలదీ ఇదే పరిస్థితి. అజంపురా డివిజన్‌లోని కమలానగర్, వినాయకవీధి, ముసరాంబాగ్ డివిజన్‌లోని మూసానగర్, ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లోని శంకర్‌నగర్ కాలనీ ప్రజలకు కంటిపై కునుకు కరవైంది.
ట్రాఫిక్ తిప్పలు
కురిసిన వానతో ఎగువ నుంచి వచ్చిన వరద ముసారాంబాగ్-అంబర్‌పేట్ వంతెనపై నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విపత్తు ప్రతిస్పందన దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను వేరే దారుల్లోకి మళ్లించారు. యాకత్‌పురా వంతెన కింద వరద నిలిచిపోయింది.