కోడి.. కోడి.. నువ్వేం చేస్తావ్ అంటే.. ఉదయాన్నే కొక్కొరొకో అని కూస్తానంటుంది. కానీ... సంక్రాంతి పందెం కోళ్లు అలాకాదు.! తనను చంకలోపెట్టుకుని చంటిపిల్లాడిలా సాకిన యజమానికి కాసులు కురిపిస్తా అంటున్నాయి. అందుకే అవి 30 వేల నుంచి మొదలుకుని....లక్ష రూపాయల వరకూ పలుకుతుంటాయి. వాటిపై ఆశలుపెట్టుకున్న పందెంరాయుళ్లు....ఇక కన్నబిడ్డల్లా వాటినీ సాకుతారు. బాదం,పిస్తా, జీడిపప్పు వంటి ఎండుఫలాలేకాదు.... బరిలో తమ పౌరుషాన్ని నిలబెట్టే కోడిని మటన్, చికెన్ ఖైమా కూడా వేసి.... మేపుతారు. ఈతకొట్టిస్తారు. వ్యాయామం చేయిస్తారు. మొత్తంగా బాగా బలిష్టంగా , ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తారు. అలాంటి పుంజుపై......లక్షల్లో పందేలు కాస్తుంటారు. యజమాని పౌరుషాన్ని నిలబెట్టాలని బరిలోకి దిగే కోళ్లలో ఒకటి విజయం సాధిస్తే.. మరొకటి కొట్లాడి కొట్లాడి.. పడిపోతుంది.
కోస కోడికి పుల్ డిమాండ్
బరిలో ప్రత్యర్థిని పడగొట్టే కోళ్లకే కాదు..పడిపోయిన కోళ్లకూ డిమాండ్ ఉంటుంది. పందెంలో ఓడిన కోడిని కోసకోడి అంటారు. సాధారణంగా రెండు నుంచి 3 కిలోల బరువుండే కోస కోడికూడా ఐదారు వేలదాకా పలుకుతోంది. పందేలు చూడడానికేకాదు.... పందెంలో చచ్చిన కోళ్లకోసమూ మాంసం ప్రియులు పోటీపడుతుంటారు. ఐదువేలు పెడితే ఐదు కిలోల మటన్ వస్తుంది కదా....అని ప్రశ్నిస్తే.. ఆ టేస్టే వేరంటున్నారు.
రుచి చూశారంటే..వదలరు
పందెంలో దించే కోళ్ల జాతి రకాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది. చచ్చిన కోళ్ల ధరలూ వాటికి తగ్గట్లే ఉంటాయి. ఎంతైనా సరే పందెం కోడి కూర రుచి చూడాల్సిందే అని వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. కొనుగోలు చేసిన కోడిని తీసుకెళ్లి....అక్కడే కమ్మని కూర చేయించుకుంటున్నారు. అలాంటి వారికోసం బరులవద్దే మంచిగా మసాలా దట్టించే..... తాత్కాలిక హోటళ్లూ వెలిశాయి. నాటు కోడి అందులోనూ బాగా మేపిన కోడిని కొనేందుకు ఎంతైనా వెనకాడడం లేదు.
మొత్తానికి పందెంకోళ్లు చచ్చినా... బతికినా కాసులు కురిపిస్తున్నాయి. ప్రాణాలు విడిచినా పసందైన వంటకంగా జిహ్వచాపల్యాన్ని తీరుస్తున్నాయి.
- ఇదీ చదవండి : పండగ పూట పసందైన రుచి 'గోంగూర మటన్'