సచివాలయం కూల్చివేతపై ఇరువైపుల న్యాయవాదులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. సచివాలయం భవనాలను ఎందుకు కూల్చివేస్తున్నారని సర్కారును ప్రశ్నించింది. సచివాలయంలో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్నాయని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వివరించారు. నివేదిక పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం... ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది కానీ.. భవనాలు కూల్చాలని చెప్పలేదు కదా అని పేర్కొంది. జిల్లా కోర్టుల్లో కూడా అగ్నిమాపక చర్యలు లేవని... వాటిని కూల్చి కొత్తవి కట్టివ్వాలని తాము ప్రభుత్వాన్ని అడుగుతున్నామా అని వ్యాఖ్యానించింది.
ఏపీ ఖాళీ చేసిన బ్లాకులు వాడుకోవచ్చుగా..?
ఏడేళ్ల క్రితం నిర్మించిన బ్లాకులను కూడా కూల్చాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. సీఎం, సీఎస్ ఉండే సీ బ్లాక్ పురాతనమైనదైతే... ఇతర బ్లాకుల్లో సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదా అని ఆరా తీసింది. ప్రభుత్వ శాఖలు వేర్వేరు చోట ఉన్నాయని... వాటన్నింటినీ ఒకే చోట నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అదనపు ఏజీ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఐదు బ్లాకులను ఖాళీ చేసింది కదా.. వాటిని వినియోగిస్తే సరిపోదా అని హైకోర్టు అడిగింది.
రాజకీయ నేతలు కోర్టుకు వస్తే తప్పేంటి..?
సచివాలయం కూల్చివేయాలని సాంకేతిక కమిటీ కూడా సిఫార్సు చేసిందని అదనపు ఏజీ వివరించగా... కొత్త భవనాలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిన తర్వాత ఆ కమిటీ ఏర్పాటు చేశారని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంపీ రేవంత్ రెడ్డి వంటి నేతలు వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని అదనపు ఏజీ వాదించగా.. ప్రజల అంశంపై రాజకీయ నేతలు కోర్టుకు వస్తే తప్పేంటని ధర్మాసనం ప్రశ్నించింది.
పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోలేం..!
పిటిషనర్పైనా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. దేశానికే ఆదర్శంగా ఉండేలా కొత్త సచివాలయం నిర్మిస్తే తప్పేంటని పిటిషనర్ పీఎల్ విశ్వేశ్వరరావు తరఫున వాదించిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ను ప్రశ్నించింది. పరిపాలన విషయాల్లో కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయని అడిగింది. గతంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పార్కుల కోసం ప్రజాధనం ఖర్చు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని ఉదాహరణగా చెప్పింది.
నేడు విచారణ...
ప్రజా ధనం దుర్వినియోగం అయినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సచివాలయం ప్రజల కోసం కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని.. సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజా ధనం ఏ విధంగా వినియోగించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ కోర్టులు కాదు కదా అని ధర్మాసనం పేర్కొంది. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలా... మౌలిక సదుపాయాలకా... ఇతర రంగాలకే అనే విషయంపై ప్రభుత్వానికి తామెలా సూచిస్తామని ప్రశ్నించింది. తదుపరి వాదనల కోసం విచారణను నేటికి వాయిదా వేసింది.