పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తూ పలువురిని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. రాష్ట్రంలో రాజ్యాంగ బ్రేక్ డౌన్ జరిగిందా? లేదా? తేలుస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ హైకోర్టులో వాదనలు వినిపించారు. తన కుమారుడు రెడ్డి గౌతమ్, కోడలు లోచనను విజయవాడలో గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ 4వ పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని... రెడ్డి గోవిందరావు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై న్యాయవాది రవితేజ వాదనలు వినిపిస్తూ...ఈ విషయంలో పోలీసులు చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. విజయవాడలోని పిటిషనర్ తరఫు న్యాయవాది షేక్ ఇస్మాయిల్ ఇంటిపై పోలీసులు దాడులు చేశారని... పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై కోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే... వాస్తవం అని తేలిందని కోర్టుకు వివరించారు. పోలీసులు సీఆర్పీసీ నిబంధనలను అనుసరించలేదని... గౌతమ్, లోచనని అక్రమంగా 2019 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు నిర్బంధంలో ఉంచారని తెలిపారు.
పిటిషనర్ తరఫు వాదనలు విన్న హైకోర్టు... అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌కు కొన్ని సూచనలు చేసింది. తమ ముందున్న అక్రమ నిర్బంధం వ్యాజ్యాలనే కాకుండా... తాము ఇచ్చిన తీర్పులు, రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాదనలు వినిపించాలని కోరింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో రాజ్యాంగ బ్రేక్ డౌన్ జరిగిందా? లేదా అనేది తేల్చాలనుకుంటున్నామని వ్యాఖ్యానించింది. పిటిషన్లు ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడటాన్ని తప్పుపట్టింది. ఈ చర్య వ్యవస్థను భయపెట్టినట్లని పేర్కొంది. భయం కారణంగా న్యాయవాదులు రాకుంటే... న్యాయస్థానాలు మూసేయాల్సి ఉంటుందని పేర్కొంది.
బిహార్‌లోని పట్నాలో పోలీసులు ఓ న్యాయవాది ఇంట్లో తెల్లవారుజామున తనిఖీలు చేసిన విషయం హైకోర్టు సీజేకు తెలిసి... సుమోటోగా కేసును స్వీకరించారని గుర్తు చేసింది. ఆ రాష్ట్ర డీజీపీని పిలిచి మందలించారని ధర్మాసనం పేర్కొంది. ఈ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ దంపతుల నిర్బంధం వ్యవహారంలో జ్యుడీషియల్ విచారణ చేసిన న్యాయాధికారిని ధర్మాసనం అభినందించింది. పోలీసు బృందం చేయలేని దర్యాప్తును ఆయన ఒక్కరే పూర్తి చేసి... వివరాలతో నివేదిక సమర్పించారని వెల్లడించింది.
పిటిషనర్ తరఫు వాదనలు ముగిసినందున... పోలీసుల తరఫు వాదనలు వినిపిస్తానని ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్ఎస్ ప్రసాద్ కోరగా... అందుకు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెగని పంచాయితీ