gutha sukender reddy : అప్రజాస్వామిక విధానాలతో కేంద్ర సర్కార్.. దేశంలో అరాచకాన్ని సృష్టిస్తోందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థకి తూట్లు పొడుస్తూ.. ప్రజలను ఇబ్బందులు గురి చేస్తోందని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా తెలంగాణకు రావాల్సిన అప్పుల విషయంలోనూ కేేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లకు అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకం అమలు విషయంలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపెడుతోందని గుత్తా ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ భేషుగ్గా ఉందని.. కానీ కేంద్రం కావాలని కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని బంద్ చేయాలని కుట్ర చేస్తోందన్నారు. గ్యాస్ డీజిల్, పెట్రోలు ధరలను పెంచి.. నిత్యావసరాలపైనా జీఎస్టీ విధించి పైశాచికంగా వ్యవహరిస్తోందని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"స్మశాన వాటికలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం దుర్మార్గం. మోదీ ప్రభుత్వంలో ప్రజలు బతికేలా లేరు. కేంద్ర సర్కార్ ప్రజలను పీక్కు తింటోంది. 2014లో రూ.40 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.100 లక్షల కోట్లు అప్పులు చేసింది మోదీ సర్కార్. ఇది కేంద్రం ఘనకార్యం. ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి మాట వినని ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేయడమే కేంద్రం పని. భాజపా.. శివసేన పార్టీని నిర్వీర్యం చేసి.. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించింది. ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిపోతోంది. దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకునేలా మోదీ పన్నాగం పన్నుతున్నారు. ప్రజల గురించి ఆయనకు ఆలోచనే లేదు. భాజపాతో దేశం ప్రమాదంలో పడింది. దక్షిణ భారతదేశంపై సవతి ప్రేమ చూపిస్తోంది." - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్