Green bean seeds price hike : తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో పచ్చిరొట్ట విత్తనాల ధరలు పెరగనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విత్తన సంస్థలు వీటి ధరలను గణనీయంగా పెంచేశాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం పడనుంది. తెలంగాణలో పచ్చిరొట్ట విత్తనాలు లేనందున వీటి కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్ సీడ్స్) ఇటీవల టెండర్లు పిలిచింది. వాటి సరఫరాకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంస్థలు అధిక ధరలను కోట్ చేస్తూ టెండర్లు దాఖలు చేశాయి. ఆ కంపెనీలు కోట్ చేసిన ధరలను టీఎస్ సీడ్స్.. తాజాగా ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది.
రసాయన ఎరువులపై ఇచ్చే రాయితీ రూ.60 వేల కోట్లకు చేరడంతో వాటి వినియోగం తగ్గించాలని కేంద్రం రాష్ట్ర వ్యవసాయ శాఖకు సూచించింది. ఇందులో భాగంగా ఈ సారి వానాకాలం పంటల సాగు ప్రారంభమయ్యేలోపు రైతులకు పిల్లిపెసర, జీలుగ, జనుము తదితర పచ్చిరొట్ట విత్తనాలను విక్రయించాలని పేర్కొంది. వీటి రాయితీ భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది. అయితే, విత్తనాల ధరలు పెరిగినందున ప్రభుత్వం ఇచ్చే రాయితీని కూడా పెంచాలని (టీఎస్ సీడ్స్) సర్కారుకు సూచించింది. గతేడాది రైతుకు క్వింటాలు జనుము విత్తనాలను రూ.4,313కి విక్రయించగా.. ఈ సీజన్‌లో రూ.5,411కి అమ్మాలని టీఎస్ సీడ్స్ ప్రతిపాదించింది. గత సంవత్సరం జాతీయ మార్కెట్‌లో క్వింటాలు జనుము విత్తనాలను టీఎస్ సీడ్స్) రూ.6,636కు కొనుగోలు చేసింది. ప్రభుత్వం రూ.2,323ను రాయితీగా భరించడంతో రైతుకు రూ.4,313కు విక్రయించింది. ఈ సీజన్‌లో జాతీయ మార్కెట్‌లోనే ఆ విత్తనాల క్వింటాలు ధర రూ.8,325కి పెరిగిందని, దీనిపై ఇచ్చే రాయితీని రూ.2,914కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇలా గతేడాదితో పోలిస్తే రాయితీని రూ.2,323 నుంచి 2,914కి పెంచినా రైతుకు అమ్మే ధర రూ.5,411కు పెరుగుతుందని వివరించింది. పిల్లిపెసర విత్తనాల ధర కూడా గతేడాదితో పోల్చితే క్వింటాలుకు అదనంగా రూ.405, జీలుగ విత్తనాల ధర రూ.633కు పెంచాలని టీఎస్ సీడ్స్ తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వం రాయితీ పెంచిన తరవాత సైతం ఈ స్థాయిలో ధరలు పెరిగితే రైతులపై ఆర్థికభారం పడనుంది.
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై విక్రయించనున్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఈ విత్తనాలను విక్రయిస్తామని టీఎస్ సీడ్స్ తెలిపింది. సాధారణ పంటల విత్తనాలను రాయితీపై విక్రయించడానికి ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు.
ఇదీ చదవండి : Effect Of Sun On Crops: జనమే కాదు పైర్లు సైతం ఎండలకు విలవిల..