భాగ్యనగరంతోపాటు శివారు గ్రామాల్లోనూ పాజిటివ్ రేటు బాగా పెరుగుతోంది. జనం గుంపులుగా చేరకుండా చూడడం, రాకపోకలను కట్టడి చేయడం ద్వారా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చన్న ఉద్దేశంతో కఠిన ఆంక్షలకు పంచాయతీలు ఉపక్రమించాయి. స్థానికంగా తీర్మానాలు చేసి కొన్ని పాక్షిక, మరికొన్ని సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఈసమయంలో బయటకు వచ్చినా, దుకాణాలు తీసినా కొన్నిచోట్ల హెచ్చరికలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల జరిమానా విధిస్తున్నారు.
పాజిటివ్ రేటు పైపైకి
కిట్ల కొరత కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీల్లో) కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తిగా తగ్గించేశారు. ఒక్కో పీహెచ్‌సీలో 30-40కి మించి చేయడం లేదు. ఇందులోనూ పాజిటివ్ రేటు 35-40శాతం వరకు వస్తోంది. ఉదాహరణకు గురువారం మాడ్గుల పీహెచ్‌సీలో 39 మందికి పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. మంచాలలో 26 మందికి గాను 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. అనుమానితులు చాలామంది వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి.
ఉదయం లేదా సాయంత్రం దుకాణాలు
రాత్రి 9 గంటల నుంచి ప్రభుత్వం కర్య్ఫూ విధించింది. శివారు పంచాయతీలు మధ్యాహ్నం నుంచే ఆంక్షలు విధిస్తున్నాయి. మధ్యాహ్నం 12 లేదా 2 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని తీర్మానిస్తున్నాయి. ఈ నిబంధనలు రెండు రకాలుగా అమలు చేస్తున్నారు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. మరో పద్ధతిలో ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతించి తర్వాత మూసివేయిస్తున్నారు. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని దుకాణదారులు వాపోతున్నారు.
- ఆంక్షల అమలు ఇలా..
- మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, కనకమామిడి, సురంగల్, పెద్దమంగళారం, శ్రీరాంనగర్‌లో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉ.6 గంటల వరకు ఆంక్షలు విధించారు.
- చేవెళ్ల పంచాయతీ శుక్రవారం నుంచి పాక్షిక లాక్‌డౌన్ పాటిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి. అంగడిని నాలుగు వారాలు నిలిపివేసింది.
- షాద్‌నగర్‌లోని కిషన్‌నగర్, చించోడు, మొగిలిగిద్ద; కేశంపేట మండలం పోమాల్‌పల్లి, చౌలపల్లి, కాకునూరులో మధ్యాహ్నం నుంచి దుకాణాల మూసివేత.
- నందిగామ మండల కేంద్రంలో లాక్‌డౌన్ తరహా నిబంధనలు అమలు.
- జిల్లేడు చౌదరిగూడ మండలంలో అన్ని గ్రామాల్లో కర్య్ఫూ.
- షాద్‌నగర్‌లో మొబైల్స్ దుకాణాలు ఉదయం 10 నుంచి మ.3 గంటల వరకే తెరుస్తారు. నెలాఖరు వరకు ఎలాంటి లావాదేవీలు జరపొద్దని స్థిరాస్తి వ్యాపారుల సంఘం ప్రకటించింది.
- కందుకూరులో లాక్‌డౌన్ విధించారు. ఉదయం మాత్రమే దుకాణాలకు అనుమతి. దెబ్బడిగూడలో పాక్షిక కర్ఫ్యూ.
- తుక్కుగూడలో లాక్‌డౌన్ పాటిస్తుండగా, మహేశ్వరంలో పాక్షికంగా అమలు చేస్తున్నారు. యాచారం మండలం కుర్మిద్ద పంచాయతీలో నిబంధనలు అమల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: మహాలో 50 లక్షలకు చేరువలో కరోనా కేసులు