chalo vijayawada: ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు రోజు రోజుకి తీవ్రతరం అవుతుండటంతో వారిని విరమింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పీఆర్సీ సంబంధించిన అంశాల పై మంత్రుల కమిటీతో చర్చలకు రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఫిబ్రవరి 1 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపనున్నట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ నేతలకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి లేఖ రాశారు. హెచ్ఆర్ఏ అంశాలతో పాటు, రికవరీ, అదనపు క్వాంటం పెన్షన్ వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
‘చలో విజయవాడ’..
PRC Issue in AP: ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని లక్షల మంది ఉద్యోగులతో నిర్వహించేందుకు పీఆర్సీ సాధన సమితి ఏర్పాట్లు చేస్తోంది. భారీ ర్యాలీ, సభతో ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని భావిస్తోంది. రిలే నిరాహార దీక్షలు విజయవంతమైన నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యమ కార్యాచరణపై సోమవారం విజయవాడలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది.
ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
chalo vijayawada in AP: చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఉద్యోగులు, పింఛనుదారులు గమనించాలన్నారు. ‘3వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులోని మీసాల రాజారావు వంతెన నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఫుడ్ జంక్షన్ మీదుగా భానునగర్ సెంటర్‌కు చేరుకుంటుంది. అక్కడ సభ నిర్వహిస్తాం. అన్ని విభాగాల ఉద్యోగులు, పింఛనుదారులు లక్షలాదిగా తరలిరావాలి. సభ ఎంత విజయవంతమైతే ప్రభుత్వం అంత ముందుకొచ్చి సమస్యలపై చర్చిస్తుంది. లేకుంటే ఇవే అవమానాలు కొనసాగుతాయి. చర్చలకు పిలిచినట్లు, దానికి మేం అంగీకరించినట్లు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, క్వాంటం పింఛను ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు. చలో విజయవాడకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశాం. ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. దీనిపై న్యాయపరంగా వచ్చే చిక్కులను ఎదుర్కోవడానికి ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులను నియమించుకున్నాం’ అని తెలిపారు.
ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం
employees protest on PRC: ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ‘పీఆర్సీపై సీఎం జోక్యం చేసుకోవాలి. చలో విజయవాడకు సంబంధించి ఉద్యోగులపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి, అధికారులు అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికపై చర్చించి, మమ్మల్ని మోసం చేసి రికవరీ పీఆర్సీ ఇచ్చారు. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక ఇవ్వాలంటూ చలిలో జాగారం చేశాం. అయినా ఆ నివేదికను బయటపెట్టడం లేదంటే అందులో ఏముంది? ఈ నెల పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేశాం. అధికారులపై ఒత్తిడి చేసి, కలెక్టర్లు జీతాలు చేయించేలా ఇబ్బందులు పెడుతున్నది మీరు కాదా? 70 శాతం జీతాలు ఇప్పటికీ వేయలేదు’ అని అన్నారు.
ఆర్థికశాఖ ఐఏఎస్‌లపై ఫిర్యాదు చేస్తాం
ఉద్యోగులపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆర్థిక శాఖ ఐఏఎస్‌లపై.. దిల్లీకి వెళ్లి డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ హెచ్చరించారు. ‘ఆర్థికశాఖలోని ఐఏఎస్‌లు అతిగా ప్రవర్తిస్తున్నారు. సర్వీసు రిజిస్టర్లు పరిశీలించకుండానే జీతాలు నిర్ణయిస్తున్నారు. జీతాలు వేసేందుకు అధికారులను భయపెట్టేలా మెమోలు ఇచ్చారు. ఉద్యోగులపై ఇష్టారాజ్యంగా చర్యలు తీసుకోవడానికి ఇది అటవిక రాజ్యం కాదు. తాటాకు చప్పుళ్లకు భయపడొద్దు. ఉద్యోగులు ఎవరిపైన చర్య తీసుకున్నా మేమంతా అండగా ఉంటాం’ అని చెప్పారు.
కొత్త వేతన స్కేలు అమలు...
PRC for employees: ఇదే సమయంలో జనవరి నెల వేతనాలను... కొత్త వేతన స్కేలు ప్రకారం అమలు చేసిననట్లు ఆర్ధిక శాఖ స్పష‌్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్‌లు.. తమ పే స్లిప్‌లను సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ ద్వారాగానీ, మొబైల్ యాప్ ద్వారాగానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ ఉద్యోగి మొబైల్ ఫోన్ కు కూడా వేతనానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం కూడా పంపామని వెల్లడించింది. ఐతే.. ప్రభుత్వ వైఖరిపై పీఆర్సీ సాధన సమితి నేతలు మండిపడ్డారు. చలో విజయవాడతో సత్తాచాటుతామని తెలిపారు.
ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూడండి...
ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, హెచ్ఓడీలకు..సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు... ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్... కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులు ఎంత వరకూ వచ్చాయనే అంశంపై సమీక్షించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని.. ఉద్యోగ సంఘాలను ఆందోళన విరమించేలా ఒప్పించాలని సూచించారు. కరోనా కష్ట సమయంలో ఉద్యోగులు సమ్మెకు వెళితేదాని పరిణామాలు ఎలా ఉంటాయనేది ప్రతి ఉద్యోగీ ఆలోచించాలన్నారు.