తెలంగాణలో ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదని, వైద్య ఖర్చులు అందరికీ అందుబాటులోకి రావాలని రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా చెబుతున్నానని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్యం అందలేదన్న దైన్యం మన రాష్ట్రంలో అసలే రాకూడదని, మధ్యతరగతి వారికైనా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలన్నదే తన తపనగా గవర్నర్ పేర్కొన్నారు. రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు.
బిల్లు పారదర్శకంగా ఉండాలి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్య చికిత్స బిల్లుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని గవర్నర్ సూచించారు. రోగిని అడ్మిట్ చేసేటప్పడే పూర్తి పారదర్శకతతో చికిత్స వివరాలు, ఖర్చులు వివరించాలని, వారి నమ్మకాన్ని చూరగొనాలని ఆమె అన్నారు. ఆసుపత్రుల్లో పడకల అందుబాటు కోసం ‘బెడ్స్ ఫూల్’ విధానం ద్వారా పడకలు అందుబాటు వివరాలు ముందే తెలిసేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. రోగులను ఆస్పత్రుల్లో పడకల కోసం అన్ని చోట్లా తిరిగే శ్రమ నుంచి కాపాడాలని గవర్నర్ పేర్కొన్నారు. ఇది కొవిడ్ సంక్షోభ సమయమని, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రత్యేక బాధ్యతతో, మానవతా దృక్పథంతో పనిచేయాలని డా.తమిళిసై సూచించారు.
ఆలస్యం కాకుడదు
కరోనా పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడం వల్ల అనుమానితుల్లో మానసిక ఆందోళన కలుగుతుంది. లాబోరేటరీలు ఫలితాలు తొందరగా అందించే విధంగా పనిచేయాలి. హెల్త్ కార్డులు, వైద్య బీమా కార్డుల వారికి వైద్యం అందించడానికి బీమా సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేసి ప్లాస్మా థెరఫిని అందించాలి. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు మరిన్ని సమకూర్చుకుని, ఎకానమి ప్యాకేజీలో కొవిడ్ చికిత్సను అందుబాటులోకి తేవాలి. మరిన్ని పడకలను, సిబ్బందిని సమకూర్చుకోవడానికి కృషి చేయాలి.
టెక్నాలజీని ఉపయోగించుకోవాలి
కేసులు మరిన్ని పెరిగినా ప్రభుత్వ, ప్రైవేట్ సమన్వయంతో అందరికీ వైద్యం అందించే విధంగా సిద్ధంగా ఉండాలని గవర్నర్ సూచించారు. దాదాపు 80 శాతం బాధితులకు చాలా తక్కువ స్థాయిలో లక్షణాలు ఉంటాయని, వారికి హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించే క్రమంలో వీడియో కన్సల్టేషన్, కౌన్సెలింగ్, టెలీ మెడిసిన్ పద్ధతుల్లో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. హైదరాబాద్ ఫార్మా, మెడికల్, ఐటి హబ్‌గా గుర్తింపు ఉన్న దృష్ట్యా వీరంతా కలిసి టెక్నాలజీ ద్వారా సమన్వయంతో రోగులకు సేవలు, వైద్యం అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో కేర్, కిమ్స్, సన్ షైన్, కాంటినెంటల్, మల్లారెడ్డి, అపోలో, యశోద, గ్లోబల్ తదితర ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తే అందరూ నవ్వారు: కేటీఆర్