కరోనా సమయంలో రాష్ట్రంలో రెండు నగరపాలక సంస్థలు, ఐదు పురపాలిక సంఘాల్లో జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని.... గవర్నర్ తమిళిసై ఆదేశించారు. ఈనెల 30న వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ పురపాలిక సంఘాల్లో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో ఫోన్లో మాట్లాడిన గవర్నర్... ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ పార్టీలు లేవనెత్తుతున్న అంశాలపై...... చర్చించారు.
కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని... అన్ని జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని గవర్నర్‌కు కమిషనర్ వివరించారు. వాటన్నింటిపై నివేదిక ఇవ్వాలని పార్థసారథికి గవర్నర్ తమిళిసై సూచించారు. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నందున మినీ పురపోరు జరపకుండా జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసైకి పీసీసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రస్తుతం ఎన్నికలు జరిపితే ప్రజలు పెద్ద సంఖ్యలో కొవిడ్ బారినపడే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేసి కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.