భాగ్యనగరంలో బోనాల ఉత్సవ సందడి మొదలైంది. మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా... వేప కొమ్మలతో, పసుపుకుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని భక్తులు తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు... పోతరాజుల విన్యాసాలు... శివసత్తుల నాట్యాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారిపోయాయి. తొలిరోజైన నేడు.. గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఆలయ కమిటీ బంగారు బోనం సమర్పించింది. లంగర్‌హౌజ్ నుంచి ప్రారంభమైన తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
వర్షం శుభసూచకం..
రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. బోనాల ఉత్సవం ప్రారంభ వేళ వర్షం కురవడం శుభసూచకమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగరంలోని అన్ని దేవాలయాలకు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. గత ఏడాది కరోనాతో పండగకు దూరం అయ్యామన్న మంత్రి... కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. అమ్మవారి చల్లని చూపుతో కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై... ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భాగ్యనగరంలో జరిగే బోనాల పండుగ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తుంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని దేవాలయాలకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి.. ప్రాజెక్టులు నిండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు.
పటిష్ఠ ఏర్పాట్లు..
బోనాల పండుగ సందర్బంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనమెత్తే భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే... వెంటనే తరలించేందుకు అంబులెన్స్‌లను, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచారు. భక్తుల కోసం తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 600 మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి వర్షం ఏకదాటిన కురుస్తూనే ఉంది. వర్షంలో సైతం భక్తులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఉజ్జయిని మహంకాళి ఘటాల ఉరేగింపు...
మరోవైపు ఈ నెల 25న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 26 వరకు ఘటాల ఊరేగింపు కార్యక్రమం జరుగనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేఅమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మహంకాళి మాత కృపతో పాడి పశువులు చల్లగా ఉండి.. వర్షాలతో పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.