ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉద్ధృతితో 38 గ్రామాలు నీట మునిగాయి. గోదావరి బ్యాక్ వాటర్ ముంచెత్తుతున్న కారణంగా తూర్పుగోదావరి దేవీపట్నం మండలంలో పి.గొందూరు, పూడిపల్లి, తాళ్లూరు, కొండమొదలు, చిన్న రమణయ్యపేట, సీతారం గ్రామాల పోలవరం నిర్వాసితులు రాత్రీ పగలు వరద నీటిలోనే ఉంటున్నారు. నమ్మించి ఓట్లు వేయించుకున్నారని... తీరా నెగ్గిన తర్వాత తమకు హామీలు తీర్చకుండా మొండిచేయి చూపించారని దేవీపట్నం మండలంలోని గొందూరు, కొండమొదలు ప్రాంత పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇస్తే బయటకు వస్తామని లేదంటే ఇక్కడే చచ్చిపోతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. త్వరలో ప్యాకేజీ చెల్లిస్తామని బయటకు రావాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ సింహాచలం, తహసీల్దార్ వీర్రాజు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. తమకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇస్తేనే బయటకు వస్తామని లేదంటే అక్కడే చచ్చిపోతామంటూ వారు తేల్చి చెప్పారు.
పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా...
ముంపు గ్రామాల ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో కాకవాడ, ముసురుమిల్లి, పోతవరం ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాలకు ఒక్కరు కూడా వెళ్లలేదు. ప్రభుత్వం తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులు ప్రాణాలు వదిలితే తప్ప ప్యాకేజీ ఇవ్వరా అంటూ.. ఆవేదన చెందారు. గొందూరు గ్రామస్తులంతా ఇల్లు పూర్తిగా మునిగిపోయినా... ఇంటిపైన కొందరు.. కొండలపై కొందరు ఉన్నారు. తొయ్యేరు, వీరవరం, దేవీపట్నం, గొందూరు, పూడిపల్లి, దండంగి, పోచమ్మ గండి తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న దృష్ట్యా.. అధికారులు సహాయ చర్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
గౌతమీ వంతెన వద్ద పొలాలు నీట మునక
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు అధికంగా చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని గౌతమీ వంతెన వద్ద పంట పొలాలు నీట మునిగాయి.
ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి నీరు వదిలిపెట్టిన కారణంగా.. రావులపాలెం మండలంలోని గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం ఆలమూరు రావులపాలెం కొత్తపేట మండలాల్లోని పొలాలు, పశువుల పాకలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
సముద్రంలోకి భారీగా నీటి విడుదల
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించి సముద్రంలోకి 9 లక్షల 80 వేల వరద నీటిని విడిచిపెట్టారు. కోనసీమలోని గౌతమి వశిష్ట వంతెన గోదావరి నది పాయలుగా పారుతోంది. ఎగువ నుంచి వరద తగ్గినా... కోనసీమలో మాత్రం నదీ పాయలు జోరుగానే ప్రవహిస్తున్నాయి. పి. గన్నవరం నియోజకవర్గంలోని ఊడిమూడి, లంక బూరుగు లంక, అరిగెల వారి పేట, జీ పెదపూడి.. తదితర లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ముక్తేశ్వరం వద్ద కాజ్ వే ముంపు బారిన పడింది. కనకాయలంక గ్రామ ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాకు సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెదమల్లం లంక, అన్నగారు గ్రామ ప్రజలు పడవల్లో ప్రయాణించి తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం వెళ్తున్నారు. కోనసీమలో సుమారు పదివేల మందికి ముంపు బారిన పడ్డారు. లోతట్టు పల్లపు లంకలో కూరగాయల పంటలు ముంపు బారిన పడ్డాయి.
- ఇదీ చదవండి : దళిత బంధు పథకంపై అవగాహన సమావేశం ప్రారంభం