పీవోపీ గణపతి విగ్రహాల తయారీని నిలువరించి, మట్టివి ప్రోత్సహించాలని కొన్నేళ్లుగా హైకోర్టు చెబుతూ వస్తోంది. వినాయక చవితికి ముందు తయారీదారులతో ఒకట్రెండేళ్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు సమావేశాలను నిర్వహించి మట్టి విగ్రహాల ఆవశ్యకతను చాటి చెబుతున్నారు. ఈ ఏడాది సమావేశాలు నిర్వహించలేదు. దీంతో 80 శాతం పీవోపీ విగ్రహాలే తయారయ్యాయి. మిగతావి మట్టివి రూపొందించినా ధర ఆకాశాన్నంటుతోంది. నగరంలో ప్రతిష్ఠించే గణపతుల్లో 70 శాతం హుస్సేన్‌సాగర్‌లోనే కలుపుతుంటారు. నగర వ్యాప్తంగా మరో 32 చెరువుల వద్ద నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సాగర్‌తోపాటు, ఏ చెరువుల్లోనూ పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ప్రధాన చెరువులకు కాలుష్యం చేయని ప్రత్యేక ప్రాంతాల్లో కలపొచ్చని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. హుస్సేన్‌సాగర్ సమీపంలో పీవీఘాట్ తదితర ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను కలపొచ్చని తెలిపింది. ఈ ఏడాది చిన్నా పెద్దా కలిపి లక్షన్నర గణపతులను ప్రతిష్ఠిస్తారని అంచనా వేస్తున్నారు. వీటన్నింటిని ఎక్కడ కలపాలన్నదే ఇప్పుడు సందేహం.
క్రేన్ల ఏర్పాటు నిలిపివేత...
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహానగరంలో నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్‌సాగర్, చెరువుల వద్ద దగ్గర క్రేన్‌లు, ఇతరత్రా ఏర్పాట్లను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ స్థాయిలో ఆదేశాలు వచ్చిన తరువాతే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. వాస్తవానికి శుక్రవారం నుంచే నిమజ్జనం ఏర్పాట్లను మొదలుపెట్టి రెండ్రోజుల్లోనే పూర్తి చేయాలని తొలుత నిర్ణయించారు.
నిమజ్జన కోనేరులే దిక్కా!
బెంగళూరు తరహాలో రాజధానిలో 28 చోట్ల జీహెచ్‌ఎంసీ కోనేరులు ఏర్పాటు చేసింది. లోతు నాలుగైదు అడుగులు ఉంటుంది. 5 అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. భారీగా ఉండే ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథులను వీటిల్లో నిమజ్జనం చేయడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయగానే వెంటనే క్రేన్‌లతో తీసేయాలన్న ఉద్దేశ్యం ఉందని బల్దియా అధికారి ఒకరు తెలిపారు. లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనానికి రెండు రోజులు పడుతుందన్న భావన ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లి వారిచ్చే ఆదేశాలకనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నారు.
7,500 విగ్రహాలకు ఆన్‌లైన్ అనుమతులు
వినాయక మండపాల్లో అయిదు అడుగులు, ఆపై ఎత్తున్న గణేష్ విగ్రహాలను ప్రతిష్టించేందుకు పోలీసులు 7,500 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లోని మండపాల నిర్వాహకులకు సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో దక్షిణ మండలం డీసీపీ గజరావ్ భూపాల్ దృష్టికి తీసుకెళ్లగా స్థానిక పోలీస్ ఠాణాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చంటూ సూచించారు.
కోర్టు ఉత్తర్వులు ఇంకా నా దృష్టికి రాలేదు. ప్రభుత్వ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందుగా సంబంధిత అధికారులతో మాట్లాడతాను.
- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
గ్రేటర్‌లో గణపతుల గణాంకాలు (2019 లెక్కల ప్రకారం)
- అయిదు అడుగులు, అంతకంటే పెద్దవి: దాదాపు 60 వేలు
- అయిదు అడుగుల లోపు 2 లక్షలు
- నిమజ్జనం: హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరవ్యాప్తంగా ఉన్న చెరువులు, కొనేరుల వద్ద.
ఇవీ చూడండి: Vinayaka Chavithi: ముస్తాబైన మండపాలు.. గణనాథుడి తొలిపూజకు వేళాయే