నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతని జీహెచ్ఎంసీ ఉత్తర మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్పై ప్రజల్లో అవగాహన కల్పించిన వారియర్స్‌తోపాటు నిబంధనలు పాటించిన సంస్థలకు హరిహర కళాభవన్‌లో సర్టిఫికేట్లను అందించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్‌ను అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలబెట్టేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. నాలాల్లో ప్రజలు వ్యర్థాలు వేసి.. అవి పొంగినప్పుడు అధికారులను నిందిస్తుంటారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. హోటళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ నిబంధనలను అమలు పరుస్తూ ర్యాంకులు సొంతం చేసుకోవడం అభినందనీయమని అన్నారు.
ప్రతి ఇంటికి, కాలనీకి స్వచ్ఛ వారియర్స్ తిరుగుతూ.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ ముకుంద్ రెడ్డి, ప్రవీణ్, తేజస్వి, గీతా కుమారి, శ్రీనివాస్, మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జలంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'పద్య ప్రభంజనం' గ్రంథాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత