జీహెచ్‌ఎంసీ 150 డివిజన్లకు డిసెంబరు 1న ఎన్నిక జరిగింది. ఫలితాలు డిసెంబరు 4న వెల్లడయ్యాయి. నేరేడ్‌మెట్ డివిజన్ ఇంకా వెలువడలేదు. ఆ ఫలితాన్ని మినహాయిస్తే 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా తెరాస, 48 సీట్లతో భాజపా, 44 సీట్లతో ఎంఐఎం, 2 సీట్లతో కాంగ్రెస్ వరుసగా నిలిచాయి. ఇప్పుడు మేయర్, ఉపమేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తే గెలిచిన కార్పొరేటర్లతోపాటు, 44 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు సైతం ఓటింగ్‌లో పాల్గొంటారు. నగరంలో నివాసం ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ్య సభ్యులు, ఎమ్మెల్సీలకు జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకుని, మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశాన్ని మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5(1) కల్పించింది. పార్టీల వారీగా చూస్తే తెరాసకు అత్యధికంగా 31 మంది, ఎంఐఎంకు 10, భాజపాకు ఇద్దరు, కాంగ్రెస్‌కు ఒక ఎక్స్‌అఫిషియోలున్నారు. ఆ లెక్కన మొత్తం సభ్యుల సంఖ్య 194కు చేరుతుంది. అప్పుడు మేజిక్ ఫిగర్ 98 అవుతుంది. అయితే ఈ మేజిక్ ఫిగర్ మేయర్ ఎన్నికకు తప్పనిసరి కాదని, కేవలం సర్వసభ్య సమావేశం నిర్వహణకే అని చట్టం చెబుతోంది. అంటే.. 98 మంది సభ్యులుంటేనే (కోరం) సమావేశం నిర్వహించాలి. లేదంటే వాయిదానే. కోరం ఉన్న రోజున సమావేశం నిర్వహించి చేతులెత్తే విధానంలో జిల్లా కలెక్టర్ మేయర్ ఎన్నిక చేపడతారు.
పొత్తులకు అవకాశమా?
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పూర్తి మెజార్టీ దక్కని చోట పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కోసం పెద్దఎత్తున క్యాంపు రాజకీయాలకు తావిచ్చాయి. ఎందుకంటే ఎక్కువ సీట్లు, తక్కువ సీట్లనే విషయంతో సంబంధం లేకుండా.. ఏవేనీ రెండు పార్టీలు జట్టు కట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అక్కడ తలెత్తింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ పరిస్థితి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో తెరాస, ఎంఐఎం పొత్తుకు దూరంగా ఉంటాయని, భాజపా సైతం వేరే పార్టీతో జత కట్టకపోవచ్చని అంటున్నారు. పొత్తులుంటే మాత్రం కనీసం 98 మంది మద్దతున్న పక్షానికే మేయర్ పీఠం దక్కుతుంది. డిసెంబరు నెలాఖరుకు ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్యపై పూర్తి స్పష్టత వస్తుందని, అప్పుడు మేజిక్ ఫిగర్ స్వల్పంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత ఎప్పుడైనా మేయర్, ఉపమేయర్ నోటిఫికేషన్ వెలువడచ్చంటున్నారు. నోటిఫికేషన్ జారీకి జాప్యం జరిగినా, మేయర్ ఎన్నికకు కోరం లేకపోయినా ప్రత్యేక అధికారి పాలన రావచ్చు.
మేయర్‌గా గెలవాలంటే..
నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితాన్ని పక్కనపెడితే గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియోలు సమావేశానికి హాజరైతే తెరాస బలం 86, ఎంఐఎంకు 54, భాజపాకు 50, కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యులుంటారు. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ వేర్వేరుగా మేయర్ అభ్యర్థిని బరిలో నిలిపి, విప్ జారీ చేస్తే ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారు. అప్పుడు తెరాసనే గెలుపు వరిస్తుందని ఓ జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి తెలిపారు.