విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఆర్. వసంత గ్రామానికి చెందిన గణేశ్ చిన్నప్పటి నుంచి శారీరక క్రీడలంటే.. ఆసక్తి కనబరిచేవాడు. ఎత్తు, శరీర సౌష్ఠవం ఉండడం కలిసొచ్చిన అంశం. మొదట్లో ఈతలో మంచి పేరు సంపాదించుకున్న ఈ కుర్రాడు... 2017లో సైక్లింగ్ పోటీల్లోకి ప్రవేశించాడు. తొలి పోటీల్లోనే ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. తొలి విజయం ప్రోత్సాహంతో సైక్లింగ్‌పై దృష్టి పెట్టిన గణేశ్.. అనతి కాలంలోనే మెరుగైన క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. గుంటూరులో 2018లో జరిగిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో బంగారం, కాంస్య పతకాలు అందుకున్నాడు. గన్నవరంలో నిర్వహించిన పోటీల్లో రజత పతకం గెలుపొందాడు.
అనుకోని ప్రమాదం:
ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా...సైక్లింగ్‌లో జాతీయ స్థాయిలో రాణించాలన్న పట్టుదల అకాడమీ వైపు నడిపించాయి. కొడుకు కోరిక కాదనలేని కుటుంబం మద్దతుగా నిలిచింది. ధైర్యంగా ముందడుగు వేసి... అకాడమిలో చేరాడు. కానీ.. అనుకోని ప్రమాదం అతని కాలికి బలమైన గాయమైంది. దాంతో ఆశయాన్ని పక్కకుపెట్టాల్సిన వచ్చింది.
మళ్లీ జాతీయ స్థాయి పోటీలకు
గాయం తీవ్రత వల్ల.. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనవద్దని వైద్యులు సూచించారు. కానీ... బలమైన కోరిక ముందు హెచ్చరికలు వినిపించలేదు.. 6నెలలు ఇంటికే పరిమితం కావాలంటే.. 3 నెలల్లోనే సైకిల్ ఎక్కాడు... గణేశ్‌కి గాయం ఇబ్బంది పెడుతున్నా.. తట్టుకుని నిలబడ్డాడు. మళ్లీ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి... ఔరా అనిపించాడు.
దాతల సాయం మీదే..
పుణెలో జరిగిన అండర్-19 జాతీయస్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.. ఈ కుర్రాడు. గాయం తీవ్రత, సరైన శిక్షణ లేక పతకం మాత్రం గెలవలేకపోయాడు. జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్నా... తగిన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్నాడు. పోటీలకు వేరే ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సినప్పుడు దాతల సాయం మీదే ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అన్న బాటలోనే...
గణేశ్ సోదరి రేవతి.. అన్న బాటలోనే పయనిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతూ సైకిల్ రైసుల్లో దూసుకుపోతోంది. 2019 రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత, కాంస్య పతకాలు సాధించింది. ఈ అమ్మాయి ప్రతిభకు మెచ్చిన వరల్డ్ విజన్ అనే సంస్థ... 60వేల విలువైన సైకిల్‌ను బహుకరించింది. అన్నలాగే జాతీయస్థాయి పోటీల్లో రాణించడమే లక్ష్యమంటోంది... దమరసింగి రేవతి.
క్రీడా వసతులు లేకపోయినా, పేదరికం వేధిస్తున్నా.. రాష్ట్ర, జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తున్న ఆ అన్నాచెల్లెళ్ల పట్టుదల చూసి గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. గ్రామానికి ఎప్పటికైనా ఈ ఇద్దరూ మంచి పేరు తీసుకువస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే వీరి కోరిక. ప్రభుత్వాలు, దాతలు సాయం అందిస్తే ఉత్తమ ప్రతిభ కనబర్చి.. పతకాలు సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రపంచకప్: మరో ఇద్దరు భారత షూటర్లకు కరోనా