దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీడం రన్ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద సీఎస్ సోమేశ్ కుమార్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1,500 మంది పాల్గొన్న ఈ రన్‌ను... పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఎస్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు అంజనీకుమార్, సజ్జనార్ పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించేలా పరుగుపందెం చేపట్టడం సంతోషకరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
సమరయోధుల వేషదారణలో..
మేడ్చల్ జిల్లా కీసరలోని ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ప్రీడం రన్ నిర్వహించారు. స్థానిక యువత పెద్ద సంఖ్యలో ఈ పరుగులో పాల్గొన్నారు. మంచిర్యాలలో చేపట్టిన 2కె రన్‌ను కలెక్టర్ భారతి హోళీ కేరి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరిలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అనితా రామచంద్రన్.. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పరుగును ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో జరిగిన ప్రీడం రన్‌ను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ రావు జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో పలుచోట్ల విద్యార్థులు ఆకట్టుకున్నారు.
పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు...
కరీంనగర్‌లోని హెలిప్యాడ్ మైదానం నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు 3కే రన్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్ శశాంకతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రీడం రన్‌ను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ నుంచి కాగడల ప్రదర్శనతో కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో పరుగు నిర్వహించారు. అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్‌లు, క్రీడాకారులు, చిన్నారులతో క్యాచ్‌ది రేయిన్ వాటర్ ప్రతిజ్ఞ చేయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన ఫ్రీడం రన్‌ను ఆర్డీవో జెండా ఊపి ప్రారంభించారు.
ఇవీచూడండి: పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్: కేటీఆర్