ఉదయాన్నే 8గంటలకు లేవగానే.. ఫోన్ మోగుతుంది..! ఖైరతాబాద్‌లో టిఫిన్ పార్శిల్ ఇవ్వాలని.. పరుగున అక్కడికి చేరుకుని.. నిమిషాల్లోనే ఆర్డర్ ఇస్తాడు. మళ్లీ పంజాగుట్టలో ఓ ఆర్డర్.. కింగ్‌కోఠిలో మరో ఆర్డర్.. ఇలా రోజుకు పది దాకా ఆర్డర్లు. నిమిషాల్లోనే గమ్యం చేర్చుతుంటాడు తలాబ్‌కట్టకు చెందిన జొమాటో డెలివరీ బాయ్ అఖీల్ మహ్మద్. గత 14 నెలలుగా రోజూ ఇదే పని. కొత్తేముంది అంటారా..? ఇదంతా చేస్తోంది ఓ సైకిల్ మీద. దాన్ని తొక్కుతూనే రోజూ కనీసం వంద కి.మీ. తిరుగుతూ కుటుంబ పోషణకు అలుపు లేకుండా పనిచేస్తున్నాడీ సైకిల్ బాయ్.
ఈనెల 14న రాత్రి 10గంటలకు కింగ్‌కోఠికి చెందిన రాబిన్ ముఖేష్ నుంచి ఓ ఆర్డర్. లక్డీకాపూల్ నుంచి 12 నిమిషాల్లో తీసుకెళ్లి ఇచ్చాడు అఖీల్. వర్షం పడుతుండటంతో ముఖేష్‌ని కిందికి రమ్మని పిలిచాడు. కిందికొచ్చి తీసుకున్న ఆయన అప్పటికే పూర్తిగా తడిచిపోయి సైకిల్‌పై కూర్చున్న అఖీల్‌ని చూశాడు. ఆశ్చర్యమేసి.. సైకిల్‌పై ఇంత త్వరగా ఎలా వచ్చావని అడిగాడు. ‘‘ కుటుంబ పోషనకు తప్పదు సార్.. రావాలిగా..’ అని సమాధానం. ఏం చేస్తావని అడిగితే బీటెక్ అని చెప్పడంతో అతని అనుమతితో ఓ ఫొటో తీసుకున్న ముఖేష్.. దాన్ని ‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్’లో పోస్టు చేశాడు. దానికి సాయం చేస్తామంటూ నగర ఆహార ప్రియుల నుంచి స్పందన రావడంతో నిధి సమీకరించారు. 12 గంటల్లో ఆ అబ్బాయి కోరుకున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని కొనేందుకు రూ.65వేల కోరితే.. రూ.75వేలు జమయ్యాయి. అమెరికాకు చెందిన మహిళ రూ.30వేలు ఇవ్వడం విశేషం. శనివారం వాహనంతో పాటు వర్షపు కోటు, శానిటైజర్, మాస్కుల్ని అఖీల్‌కి అందించారు ఆ గ్రూపు ప్రతినిధులు ముఖేష్, రవికాంత్‌రెడ్ఢి
ఊహించని సాయమిది..
‘‘మెదక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నా. నాన్న చెప్పులు కుడుతూ, నేను డెలివరీ బాయ్‌గా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. లాక్‌డౌన్‌తో నాన్నకు ఉపాధి పోయింది. సైకిల్‌పైనే పనిచేయడం మొదలుపెట్టాను. రోజూ 10 దాకా డెలివరీలు చేస్తున్నా. సాయం చేస్తామన్నప్పుడు పెద్ద వాహనాన్ని నిర్వహించే స్థోమత లేక ఎక్సెల్ వాహనం అడిగాను. ఒక్కరోజులోనే ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కువ డెలివరీలు ఇచ్చి ఇంకొంత సంపాదించొచ్ఛు’’
- అఖీల్ మహ్మద్