హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు రాష్ట్ర సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగానే.. మెట్రో, ఫ్లైఓవర్లు, లింకు రోడ్లను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని చోట్ల త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి.
మూడు ఫ్లైఓవర్లు..
ఇటీవల బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో.. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సుచిత్ర-దూలపల్లి-డైరీ ఫాం జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తగ్గిపోతాయని చెప్పారు. ఈ జంక్షన్లో రద్దీ తగ్గించేందుకు.. త్వరలోనే ఫ్లైఓవర్లు(Flyovers) నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
డీపీఆర్ రూపకల్పన
మంత్రి కేటీఆర్ హామీతో.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఫ్లైఓవర్ల(Flyovers) నిర్మాణానికి డీపీఆర్‌ను రూపొందించింది. ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, బాల్క సుమన్, శంభీపూర్ రాజు సుచిత్ర జంక్షన్‌ను సందర్శించారు.
పది కిలోమీటర్లు.. రూ.450 కోట్లు..
డైరీఫాం, సుచిత్ర, దూలపల్లి జంక్షన్ల వద్ద పది కిలోమీటర్ల మేర రూ.450 కోట్లతో మూడు ఫ్లైఓవర్లు(Flyovers), నాలుగు అండర్‌పాస్‌లు నిర్మించనున్నట్లు మంత్రి వేముల తెలిపారు. గుండ్ల పోచంపల్లి నుంచి కాళ్లకల్ వరకు మేడ్చల్ పట్టణాన్ని కలుపుతూ 17 కిలోమీటర్ల పొడవున రూ.800 కోట్లతో ఫ్లైఓవర్, జంక్షన్ డెవలప్మెంట్, సర్వీస్ రోడ్ల విస్తరణ చేయనున్నట్లు వెల్లడించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర, దూలపల్లి, డైరీఫాం జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. స్థానిక ఎమ్మెల్యేల విజ్ఞప్తితో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించారు. దానికి సంబంధించి మేం డీపీఆర్ తయారు చేశాం. మూడు ఫ్లైఓవర్లు, నాలుగు అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్ల విస్తరణకు డీపీఆర్ రూపొందించాం. నేషనల్ హైవే అధికారులను సంప్రదించి.. త్వరలోనే ఈ నిర్మాణాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటాం.
- వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
త్వరలోనే కార్యరూపం..
ఈ విషయమై నేషనల్ హైవే అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే వీటి నిర్మాణం కార్యరూపం దాల్చనుందని తెలిపారు.