శ్రావణమాసం అంటే గుర్తొచ్చేది అమ్మవారికి రోజూ పూజలు. రెండో శుక్రవారం చేసే వరలక్ష్మీ వ్రతం. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీ అమ్మవారి నోము ఆచరిస్తారు. నోము నోచిన ఇంట అన్నీ శుభాలే జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో ముఖ్యపాత్ర వినియోగించేవి అమ్మవారికి ఇష్టమైన పూలదే. కమలం, చామంతి, బంతి, మల్లె, మొగలి పూలతో కొలుస్తారు. కానీ ఈ ఏడాది పూల ధరలు ఆకాశాన్నంటాయి.
రైతు బజార్లలోనే బంతి పూలు కేజీ నూట యాభై రూపాయలు, చామంతులు రెండు వందలు, గులాబీలు నాలుగు వందలకు పైగా పలుకుతుంటే... సాధారణ మార్కెట్లలో అయితే చామంతులు నాలుగు వందలు, గులాబీలు దాదాపు ఎనిమిది వందలతో చుక్కలు చూపిస్తున్నాయి. పూజకు పూలు కొనటం తలకు మించిన భారమైందంటున్నారు వినియోగదారులు.
అమ్మవారికి ఇష్టమైన తామర ధర చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్కో తామర పువ్వు దాదాపు 30 నుంచి 50 రూపాయలు, ఒక్కో మొగలి పువ్వు 200, అరిటాకులు, మామిడాకులు 50 రూపాయల పైమాటే. వర్షాభావ పరిస్థితులు, పువ్వులకు అనుకూలమైన వాతావరణం లేకపోవటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు.
సాధారణంగానే శ్రావణమాసంలో పూల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ సారి అవి మరింత ప్రియం అయ్యాయనే చెప్పాలి. వర్షాలు సరిగా లేకపోవటం వల్ల పూల సాగు తగ్గి గిరాకీ బాగా పెరిగింది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్'